శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో సిద్దులగుట్ట దగ్గర మైసమ్మ ఆలయం పక్కన శుక్రవారం(నవంబర్ 29,2019) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మహిళ ఫోటోను పోలీసులు
శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో సిద్దులగుట్ట దగ్గర మైసమ్మ ఆలయం పక్కన శుక్రవారం(నవంబర్ 29,2019) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మహిళ ఫోటోను పోలీసులు విడుదల చేశారు. కొంతకాలంగా ఆ మహిళ శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో తిరుగుతున్నట్లు గుర్తించారు. ఎయిర్‌పోర్టు, సిద్ధులగుట్ట సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్మాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్య అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.
ప్రియాంకరెడ్డిపై అఘాయిత్యం జరిగిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలోనే మరో ఘోరం జరిగింది. 48 గంటల్లోనే మరో మహిళపై అదే రీతిలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. శంషాబాద్ రాళ్లగూడ సమీపంలోని సిద్దులగుట్ట దారిలో ఓ మహిళను దహనం చేశారు. మహిళ మృతదేహం ఉన్న స్థితి, నాలుక బయటకు వచ్చి ఉండడాన్ని బట్టి ఆమెపై అత్యాచారం చేసి.. ఆ తరువాత చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడో అఘాయిత్యం చేసి శంషాబాద్ సమీపంలోని పెద్దగా జనం తిరగని ప్రాంతానికి తీసుకొచ్చి దహనం చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.
అయితే, మహిళకు సంబంధించిన వివరాలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. చనిపోయిన మహిళ చాలా రోజుల నుండి ఇదే ప్రదేశంలో తిరుగుతోందని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. ఆవిడ హిందీలో మాట్లాడుతూ ఉండేదని, మనసు ప్రశాంతంగా ఉండడం కోసం స్థానిక శివాలయం దగ్గర ఉంటున్నట్లు చెప్పారు. శివాలయంలో సినిమా షూటింగ్ జరుగుతుండడంతో.. గత రెండు రోజులుగా అక్కడక్కడే తిరగడం చూశామని చెబుతున్నారు.
ఓవైపు ప్రియాంకరెడ్డి కేసులో మరిన్ని సాక్ష్యాధారాల కోసం పోలీసులు తిరుగుతున్నారు. ప్రియాంక రెడ్డిని చంపి, తగులబెట్టిన ప్రదేశాలను జల్లెడ పడుతున్నారు. ఇదే సమయంలో.. అదే ప్రాంతంలో మరో మహిళపై ఘోరానికి తెగబడ్డారు రాక్షసులు. శంషాబాద్ సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయం ప్రహరీ వెనుక.. ఓ మహిళ మంటల్లో దహనమవుతున్నట్లుగా కొందరు గుర్తించారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మహిళ ముఖం, చేతులతోపాటు దుస్తులు కాలిపోయాయి. శుక్రవారం(నవంబర్ 29,2019) రాత్రి ఎనిమిదిన్నర సమయంలో కాలిపోతున్న మహిళ మృతదేహాన్ని చూసి.. పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం దర్యాప్తు మొదలు పెట్టారు.
మంటల్లో కాలిపోయిన మహిళకు 30 నుంచి 35 ఏళ్ల వయసు ఉండొచ్చని నిర్దారించారు. కాలి మెట్టలు ఉండడంతో వివాహితగా గుర్తించారు. మహిళ ఒంటిపై నారింజ రంగు చీర ఉంది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తీసుకెళ్లారు. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళను ఎవరైనా అత్యాచారం చేసి కాల్చేశారా.. లేదా ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతం కావడం, దరిదాపుల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆధారాలు సేకరించడం పోలీసులకు సవాల్‌గా మారింది.
బంగారు మైసమ్మ ఆలయంలో అయ్యప్ప స్వాములకు చెందిన దుస్తులు ఆరబెట్టి ఉండటంతో సాయంత్రం వరకు అక్కడ అయ్యప్ప దీక్షదారులు ఉన్నట్లు తెలుస్తోంది. మహిళను వేరే చోట హత్య చేసి అయ్యప్ప స్వాములు వెళ్లిపోయిన తర్వాత ఆలయం పక్కన కాల్చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిని సందర్శించిన డీసీపీ ప్రకాశ్‌రెడ్డి.. ఈ ప్రాంతానికి వచ్చే మార్గంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
మహిళ చనిపోయిన ప్రాంతం.. పగటిపూట రోజుకు వందల మంది అమ్మాయిలు, అబ్బాయిలు తిరిగే ప్రదేశమే. కాని, రాత్రి ఏడు దాటితే చాలు నిర్మానుష్యంగా మారుతుందని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. చనిపోవాలనుకునే వాళ్లు తమంతట తాము ఇంత దూరం వచ్చి తగలబెట్టుకోరని, ఎవరో బాగా గమనించి దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రియాంక హత్య జరిగిన 48 గంటల వ్యవధిలోనే మరో ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భయపడుతున్నారు. పైగా అదే ప్రాంతంలో ప్రియాంక తరహాలనే మహిళ మృతదేహం కనిపించడంతో శంషాబాద్ పరిసరాల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.
ఈ కేసును త్వరలోనే చేధిస్తామన్నారు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి. మహిళది హత్యా, ఆత్మహత్యా అన్నది ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసులు ఏమీ లేవని చెప్పారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్న డీసీపీ.. కేసు దర్యాప్తునకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.