Fake Lady Doctor: బంగారం ధరించిన వృద్ధ రోగులే టార్గెట్.. మత్తు ఇచ్చి ఆసుపత్రుల్లో చోరీలు.. హైదరాబాద్‌లో నకిలీ లేడీ డాక్టర్ అరెస్ట్

‘డయాజెపామ్’ ఇంజక్షన్‌తో స్పృహ కోల్పోయేలా చేసి చోరీలకు పాల్పడుతోంది. యశోద, సిటిజన్ ఆసుపత్రుల్లో చోరీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

  • Updated on- March 17, 2026 / 10:10 PM IST

Fake Lady Doctor: హైదరాబాద్‌లో నకిలీ లేడీ డాక్టర్ గుట్టురట్టైంది. రోగులకు మత్తు ఇచ్చి బంగారం దోచుకున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కిలేడీ తన భర్తతో కలిసి ఆసుపత్రుల్లో దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్, మార్కెట్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి కిలేడీని, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.

ఆమె వైద్యురాలిగా నటిస్తూ వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తోందని పోలీసులు తెలిపారు. ‘డయాజెపామ్’ ఇంజక్షన్‌తో రోగులు స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఆ తర్వాత చోరీలకు పాల్పడుతోంది. యశోద, సిటిజన్ ఆసుపత్రుల్లో ఈ తరహా చోరీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 11న రెండు చోట్ల దొంగతనాలు అయ్యాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీన్ని సవాల్ గా తీసుకుని దర్యాఫ్తు చేపట్టారు.

ఈ క్రమంలో గౌండ్ల శిరీష, సాయి కుమార్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను నవాబ్‌పేట, వికారాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారి నుంచి 11 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే బాలెనో కారు, 2 సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. మార్కెట్, చందానగర్ పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదయ్యాయి.

”బీఫార్మసీ చదివిన ఈ కిలేడీ డాక్టర్ వేషం కట్టింది. ఆసుపత్రులకు వచ్చే రోగుల నగలు కాజేసింది. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ కు చెందిన గౌండ్ల శిరీష తన భర్తతో కలిసి దోపిడీలకు కొత్త రకం స్కెచ్ వేసింది. శిరీష వైట్ యాప్రాన్ ధరించి భయం, బెరుకు లేకుండా ఆసుపత్రిలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ బంగారు ఆభరణాలు వేసుకున్న వృద్ధులను టార్గెట్ చేసుకుంటుంది. వారితో మంచిగా మాట్లాడుతుంది. ఎందుకు వచ్చారో తెలుసుకుంటుంది. ఆ తర్వాత తన పని తాను మొదలు పెడుతుంది. తనకు తెలిసిన వైద్య పరిజ్ఞానంతో చికిత్సకు సంబంధించిన పలు రకాల ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్ల పేర్లు చెబుతుంది. ఆ తర్వాత రూమ్ లోకి తీసుకెళ్లి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంగారంతో ఉడాయిస్తుంది. ఈ రకంగా ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో దోపిడీలు చేసింది ఈ కిలేడీ. కొన్ని రోజుల క్రితం యశోద ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలిని సైతం శిరీష ఈ తరహాలోనే మోసం చేసింది. డాక్టర్ గా నమ్మించి బంగారు ఆభరణాలు కొట్టేసింది” అని పోలీసులు వివరించారు.

Also Read: డ్రగ్స్‌తోపాటు మద్యం టెస్టు కూడా చేయాలి.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక కామెంట్స్