అమ్మ, నాన్న ఎక్కడున్నారో తెలియదు. అమ్మ ప్రేమకు దూరమయ్యాడు. ఆ ప్రేమ కోసం ఎంతగానో తపించాడు. చివరకు అతని ప్రయత్నం సక్సెస్ అయ్యింది. కొన్ని ఏళ్ల పాటు దూరంగా ఉన్న ఆ తల్లి ఆచూకి తెలిసింది. కానీ ఆ తల్లి చెప్పిన సమాధానంతో అతనిని కలిచివేసింది. ఇన్నేళ్లుగా తాను పడుతున్న బాధను తన తల్లి అర్థం చేసుకోలేదని..ఇందుకు రూ. 1.50 కోట్ల పరిహారం ఇప్పించాలంటూ..కోర్టు తలుపులు తట్టాడు ఆ కొడుకు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..
పూణేలో ఆర్తి, దీపక్ సబ్నిస్ దంపతులు నివాసం ఉండేవారు. వీరికి 1979లో శ్రీకాంత్ జన్మించాడు. అయితే..ఆర్తీకి సినిమాలో నటించాలని బలంగా కోరిక ఉండేది. దీంతో 1981, సెప్టెంబర్ నెలలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆర్తీ, కొడుకును తీసుకుని ముంబైకి వెళ్లిపోయింది. అప్పటికీ శ్రీకాంత్ సబ్నీస్ వయస్సు రెండేండ్లు. కానీ ఆర్తీ కొడుకును రైల్లోనే వదిలేసి వెళ్లిపోయింది. ఒంటరిగా తిరుగుతున్న శ్రీకాంత్‌ను రైల్వే ఆఫీసర్ చేరదీశాడు.
ఓ అనాథాశ్రమంలో చేరిపించాడు. 1986లో శ్రీకాంత్ అమ్మమ్మ వచ్చి ఇంటికి తీసుకెళ్లింది. బంధువుల ఇంట్లో ఉండసాగాడు. తల్లి కోసం ఆరా తీశాడు. 2017లో తల్లి ఆర్తీ ఆచూకి లభించింది. వెంటనే ఫోన్ చేశాడు. కొడుకుగా అంగీకరించింది. తప్పనిపరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందని చెప్పింది. అనంతరం ఆర్తీ, సవతి తండ్రి ఉదయ్ మహస్కర్‌ను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా తల్లి చెప్పిన మాటలను విని షాక్‌కు గురయ్యాడు శ్రీకాంత్.
‘తమకు పిల్లలున్నారు. నా కొడుకవని ఎక్కడా చెప్పకు’ అని ఆర్తీ చెప్పింది. ఇన్నేళ్లు తన తల్లి ప్రేమ కోసం ఎదురు చూసిన శ్రీకాంత్ తీవ్రంగా కలత చెందాడు. తనకు న్యాయం చేయాలంటూ..హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అనాథశ్రమంలో..బంధువుల ఇండ్లలో అనాథలా పెరిగినట్లు, భయంకరమైన జీవితాన్ని అనుభవించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నాడు.
ఓ దశలో బిక్షమెత్తుకుని బతకాల్సి వచ్చిందని, కానీ తల్లిని కలిశాక..అన్న మాటలను నన్ను కృంగదీశాయని వెల్లడించాడు. వాళ్ల కొడుకుగా అంగీకరించడంతో పాటు రూ. 1.50 కోట్ల పరిహారం ఇప్పించాలని వేడుకున్నాడు. 2020, జనవరి 13వ తేదీ సోమవారం హైకోర్టులో విచారణ జరుగనుంది.
Read More : కిలో ప్లాస్టిక్ తెస్తే KG చికెన్..KG బియ్యం