స్కూల్‌ బస్సు బోల్తా: నలుగురి పరిస్థితి విషమం

  • Publish Date - January 28, 2019 / 06:23 AM IST

గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మాచర్లలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన స్కూల్ బస్సు సోమవారం (జనవరి 26,2019) ఉదయం విద్యార్ధులతో ఉప్పలపాడు నుంచి బయలుదేరింది. మండాది సమీపంలో  ఇరుకు వంతెన దగ్గర ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించేందుకు బస్సు డ్రైవర్ స్టీరింగ్ బలంగా పక్కకు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. 

ఈ ప్రమాదంలో బస్సులోని 25 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ స్థానికులు మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లి తండ్రులు  ప్రభుత్వ అసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు.

విద్యార్థులను తరలించిన సమయంలో మాచర్ల ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్వీపర్లు కట్టు కట్టడంపై విద్యార్థుల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు చేయాల్సిన పనిని స్వీపర్ల చేత ఎలా చేయిస్తారంటూ విద్యార్థుల బంధువులు వాగ్వాదానికి దిగారు. స్టూడెంట్స్‌ని స్థానిక ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు.