సీరియల్ కిల్లర్: ప్రసాదంతోనే ప్రాణాలు తీస్తాడు

డబ్బు కోసం.. ఒకరు కాదు రెండు కాదు ఎనిమిది మందిని నమ్మించి గొంతుకోశాడు ఓ దుర్మార్గుడు. డబ్బున్న వాళ్లను, అమాయకులను టార్గెట్ చేసుకుని దేవుడి ప్రసాదం తింటే ఇంరా ధనవంతులవుతారని నమ్మించాడు. ఇదే తరహాలో నలుగురు బంధువులను, నలుగురు పరిచయస్థులను చంపేశాడు వెల్లంకి సింహాద్రి. అయిదేళ్లలో ఎనిమిది మందిని చంపిని ఈ హంతకుడి గురించి తెలుసుకుని పోలీసులు సైతం షాక్ కు గురయ్యారు. 

ఏలూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్ డబ్బు సంపాదించడానికి అడ్డదారి ఎంచుకున్నాడు. ఈజీ మనీ కోసం పూజలు పేరుతో మోసం చేయడం మొదలుపెట్టాడు. నమ్మకస్థులను ఎంచుకుని కొంగలను చంపే విషాన్ని వారికిచ్చే వాడు. ఫంక్షన్లకు గానీ, బయటకు గానీ వెళ్లే సమయంలో ప్రసాదం వారికి అందిస్తాడు. ముందే తెలుసు కాబట్టి వారిని అనుసరించి అపస్మారక స్థితికి లేదా చనిపోగానే వారి వద్ద నుంచి నగదు తీసుకుని ఉడాయిస్తాడు. 

అక్టోబరు 23న జరిగిన పీఈటీ హత్యతో అతని నిజస్వరూపం బయటపడింది. ఏలూరు మండలం లింగారావు గూడెంకు చెందిన పీఈటీ నాగరాజు రూ2లక్షల నగదు, నాలుగున్నర కాసుల బంగారంతో ఇంటి నుంచి బయల్దేరాడు. అరగంటలో వస్తానన్న భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య బంధువులకు సమాచారం అందించింది. అదే మార్గంలో వెదుకుతూ వెళ్లిన వారికి బట్లూరు పాలిటెక్నిక్ కాలేజీ వద్ద స్పృహ తప్పి పడిపోయి ఉండటం గమనించారు. 

ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అప్పటికే చనిపోయి చాలాసేపు అయినట్లు వైద్యులు తేల్చారు. అతనితో పాటు తీసుకెళ్లిన క్యాష్, బంగారు ఆభరణాలు కనిపించికపోవడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఖాకీలకు నమ్మలేని నిజాలు తెలిశాయి. విషం వల్ల చనిపోయినట్లు పోస్టు మార్టంలో వెల్లడైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ కేసుతో పాటు సీరియల్ కిల్లర్ నేరాల చిట్ట బయటపెట్టాడు.