డబ్బు కోసం మామనే హతమార్చిన అల్లుడు

  • Publish Date - February 1, 2019 / 09:30 AM IST

LIC డబ్బుల కోసం పిల్లనిచ్చిన మామనే హతమార్చిన అల్లుడు..ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. (జనవరి 30,2019) బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పట్టణ CI వెంకటరమణ 31న విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి…

ప్రొద్దుటూరులోని నెహ్రు రోడ్డులో నివాసం ఉండే యరమల చెన్నకృష్ణారెడ్డి, భార్య లక్ష్మీ ప్రసన్నకు ఇద్దరు కూతుర్లు. పెద్ద అమ్మాయి చైతన్యవాణిని సింహాద్రిపురం మండలంలోని బలపనూరుకు చెందిన రాయపాటి కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సింహాద్రిపురంలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. మామ చెన్నకృష్ణారెడ్డి ప్రొద్దుటూరులోని గౌరీ శంకర్‌ కాలేజిలో అటెండర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మామతో  LIC పాలసీ చేయించాడు. అలాగే అల్లుడి కోసం మామ రూ.10 లక్షలు అప్పుగా తెచ్చి ఇచ్చారు. డబ్బులు కట్టాలని, అప్పుల వారు తరుచూ అడుగుతున్నారని మామ చెన్నకృష్ణారెడ్డి అల్లుడిని హెచ్చరించారు.

కాగా మామను హత్య చేస్తే LIC డబ్బులు వస్తాయని అల్లుడు పన్నాగం పన్నారు. ఈ తరుణంలోనే బుధవారం రాత్రి ప్రొద్దుటూరులోని మామ ఇంటికి వెళ్లి, ఎర్రగుంట్లలో ఉన్న తన స్నేహితుడితో డబ్బులు ఇప్పిస్తానని కారులో తీసుకెళ్లాడు. ఈక్రమంలో ఎర్రగుంట్ల– ప్రొద్దుటూరు మార్గ మధ్యలో ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో మామను దారుణంగా హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కారును మరో వాహనంతో ఢీకొట్టించారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. అదే రోజు రాత్రి అత్త లక్ష్మీప్రసన్నకు ఫోన్‌ చేసి రోడ్డు ప్రమాదంలో మామ మృతిచెందాడని తెలియజేశాడు. అయితే తన అల్లుడు కిరణ్‌కుమార్‌ రెడ్డి LIC డబ్బుల కోసమే భర్త చెన్నకృష్ణారెడ్డిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు CI వెంకటరమణ తెలిపారు.