Man Kills Family : దారుణం.. భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య
పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే వారి పాలిట కాలయముడయ్యాడు. భార్యకు జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే ఆమెను కడతేర్చాడు. గంజాయి మత్తులో ఘాతుకానికి పాల్పడ్డాడు. కుటుంబం మొత్తాన్ని కడతేర్చాడు.
- Naveen
- Published On : December 13, 2022 / 09:38 PM IST
Man Kills Family : పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే వారి పాలిట కాలయముడయ్యాడు. భార్యకు జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే ఆమెను కడతేర్చాడు. గంజాయి మత్తులో ఘాతుకానికి పాల్పడ్డాడు. కుటుంబం మొత్తాన్ని కడతేర్చాడు. కుటుంబంలో ఐదుగురిని చంపి ఆపై తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉండటం అత్యంత విషాదకరం. పిల్లలను కత్తితో నరికి చంపిన తండ్రి.. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒర్నత్తవాడి గ్రామానికి చెందిన పళని సామి(45) రైతు. అతడికి భార్య వల్లీ, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రాత్రి భార్య, పిల్లలపై కత్తితో దాడి చేసిన పళని.. అత్యంత కిరాతకంగా వారిని నరికేశాడు. భార్య, నలుగురు పిల్లలు స్పాట్ లోనే చనిపోయారు. 9ఏళ్ల కూతురు భూమిక ఆసుపత్రిలో చావుతో పోరాడుతోంది. వారిని కిరాతకంగా నరికి చంపిన పళని.. తను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంజాయి మత్తులోనే అతడీ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో పళని బాధపడుతున్నాడు. దీనికి తోడు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య, పిల్లలను పళని చంపేశాడని పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు గమనించి వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతులను భార్య వల్లీ, పిల్లలు త్రిష(15), మోనిషా (14), శివశక్తి (6), ధనుష్(4) గా గుర్తించారు.
కుటుంబాన్ని పోషించుకునేందుకు పళని.. భూమి కౌలుకు తీసుకుని సాగు చేసేవాడు. అయినా ఆశించినంత లాభం రాలేదు. ఇక కరోనా కూడా ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అప్పులు ఎక్కువైపోయాయి. ఆర్థిక కష్టాలు వెంటాడాయి. పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో పళని గంజాయికి బానిసగా మారాడు. ఈ క్రమంలో అతడు ఘాతుకానికి ఒడిగట్టాడు. గంజాయి మత్తులో కుటుంబాన్ని కడతేర్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
అభంశుభం తెలియని పసి పిల్లలను సైతం తండ్రి కడతేర్చడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం పాపం చేశారని వాళ్లకి ఇంత పెద్ద శిక్ష వేశాడని కన్నీటిపర్యంతం అవుతున్నారు.
