పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును గ్రామస్తులు అడ్డుకున్నారు. 2019, ఏప్రిల్ 1వ తేదీ సోమవారం రాత్రి ఎమ్మెల్యే అభ్యర్థి గన్ని వీరాంజనేయులు లింగంపాడు వెళ్లారు. అయితే రోడ్లు, డ్రైనేజీలను నిర్మించలేదని వైసీపీ కార్యకర్తలు, గ్రామస్తులు ఎమ్మెల్యేను అడ్డుకుని, నిలదీశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. మాట మాట పెరిగి టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు.
ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రెండు వర్గాల ఘర్షణతో ఉంగుటూరులో ఉద్రిక్తత వాతావవరణం నెలకొంది.
పోలీసులు నేతలు, కార్యకర్తలను లాఠీలతో చెదరగొట్టారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కుప్పాల శ్రీనివాస్ రావు బరిలో ఉన్నారు.