థెరపీ రాళ్ల పేరుతో ఘరానా మోసం : రూ.60లక్షలతో పరారీ

  • Publish Date - May 4, 2019 / 04:29 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో థెరపీ పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. అనారోగ్య సమస్యలను థెరపీతో నియంత్రిస్తామంటూ 6 నెలల క్రితం ఓ థెరపీ సెంటర్‌ని ప్రారంభించారు. థెరపీ సెంటర్‌కు వచ్చిన వారిని నమ్మించి అధిక ధరలకి థెరపీకి అవసరమైన మ్యాట్, స్టీమ్, స్టోన్స్ విక్రయిస్తామంటూ భారీగా అడ్వాన్స్‌లు తీసుకున్నారు. ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. రూ.60 లక్షలు మేర వసూలు చేసినట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో రూ.10 వేలకు లభించే వస్తువుకి  రూ.20 వేలు వసూలు చేశారు థెరపీ సెంటర్‌ నిర్వాహకులు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయని పోలీసులు తెలిపారు. ఏ విషయంలో అయినా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుడ్డిగా నమ్మి మోసపోవద్దని చెబుతున్నారు. హైదరాబాద్ లో ఇదివరకే బయటపడిన కరక్కాయలు, పల్లి నూనె స్కామ్ లు సంచలనం రేపాయి. అదే తరహాలో ఇప్పుడు థెరపీ ఫ్రాడ్ బయటపడింది. థెరపీ పేరుతో అమాయకులను మోసం చేశారు. లక్షల రూపాయలు వసూలు చేసి పారిపోయారు. థెరపీ పేరుతో మోసం చేసిన కేటుగాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.