నిర్భయ కేసు : కుటుంబసభ్యులను కలుస్తారా..? జైలు అధికారుల లేఖ

  • Publish Date - February 22, 2020 / 08:07 AM IST

నిర్భయ దోషులను వారి కుటుంబాలు కలుసుకునేందుకు చివరి అవకాశాలను కల్పిస్తూ తీహార్ జైలు అధికారులు లేఖ రాశారు. జైలు నిబంధనల ప్రకారం ఉరి తీయడానికి 14 రోజుల ముందు దోషులను కలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యులకు అనమతిస్తారు. నిర్భయ దోషులకు మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని పటియాల కోర్టు తాజాగా డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే  కుటుంబాలతో చివరిసారి కలవడానికి నలుగురు దోషులకు జైలు అధికారులు లేఖ రాశారు. ఫిబ్రవరి 1 డెత్ వారెంట్‌కు ముందే తమ కుటుంబసభ్యులను కలిశామని దోషులు ముఖేశ్, పవన్‌ గుప్తా  జైలు అధికారులకు తెలిపారు. కుటుంబసభ్యులను ఎప్పుడు కలవాలనుకుంటున్నారని ఇద్దరు దోషులు అక్షయ్, వినయ్‌లను అధికారులు అడిగారు.

మరోవైపు జైల్లో తన తరపు న్యాయవాదిని రవి ఖాజీని కలిసేందుకు దోషి పవన్ గుప్తా నిరాకరించాడు. దోషి పవన్‌ తరపున వాదించడానికి లాయర్‌ ఏపీ సింగ్‌ తప్పుకోవడంతో ఇటీవల పటియాల కోర్టు న్యాయవాది రవి ఖాజీని నియమించింది. నిర్భయ దోషుల్లో ముగ్గురికి న్యాయపరమైన అవకాశాలు ముగిసిపోయాయి. దోషి పవన్‌ గుప్తాకు మాత్రం  క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసుకునే ఛాన్స్ ఉంది.

* నిర్భయ దోషులకు ఉరి తేదీని ప్రకటించడం ఇది మూడోసారి.
* న్యాయపరమైన అంశాల కారణంగా గతంలో రెండు సార్లు ఉరి అమలు వాయిదా పడింది.
* మొదట జనవరి 22నే దోషులను ఉరి తీయాలని కోర్టు ఆదేశించింది.
 

* ముఖేశ్‌ క్షమాభిక్ష పిటిషన్‌తో అది ఫిబ్రవరి 1కి వాయిదా పడింది.
* ఉరితీతకు రెండు రోజుల ముందు జనవరి 31న దోషులు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
* అన్ని న్యాయపరమైన అంశాలను వినియోగించుకునే వరకు ఉరి తీయరాదని కోరారు.
 

* దీంతో ఉరిశిక్ష అమలుపై కోర్టు జనవరి 31న స్టే విధించింది. 
* ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
* విచారించిన ఢిల్లీ హైకోర్టు దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదని తేల్చి చెప్పింది.
 

* శిక్ష అమలుపై స్టే యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
* హైకోర్టు తీర్పుపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
* దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిర్భయ దోషుల పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారిని ఉరి తీసేందుకు కొత్త తేదీని ప్రకటించవచ్చని తెలిపింది.
* తాజాగా మార్చి 3వ తేదీని ప్రకటించారు.

Read More : గోల్డ్ రష్ : వామ్మో బంగారం ధరలు