టిక్ టాక్.. పచ్చని సంసారాల్లో చిచ్చు రాజేస్తోంది. కుటుంబాల్లో కలహాలు రేపుతోంది. మర్డర్లకు కారణం అవుతోంది. టిక్ టాక్ కారణంగా ఓ భర్త తన భార్యని హత్య చేశాడు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్‌లాల్ వీధిలో దారుణం జరిగింది. అక్టోబర్ 27న ఫాతిమా అనే మహిళ హత్యకు గురైంది. తొలుత ఆమెది ఆత్మహత్యగా అంతా భావించారు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని తన భార్య ఆత్మహత్య చేసుకుందని ఫాతిమా భర్త చెప్పాడు. అయితే ఫాతిమా తల్లి కూతురి మృతిపై ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. విచారణలో అసలు నిజం కనిపెట్టారు.
ఫాతిమా తరచూగా టిక్ టాక్‌లో వీడియోలు చేస్తుండేది. అవి మానుకోవాలని భర్త ఎన్నిసార్లు చెప్పినా ఫాతిమా పట్టించుకోలేదు. ఈ క్రమంలో భర్తకు భార్యపై అనుమానం కలిగింది. టిక్ టాక్ వీడియోల ప్రభావంతో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త అనుమానించాడు.
ఎన్నిసార్లు చెప్పినా వీడియోలు చేయడం ఆపకపోవడంతో భార్యపై రోజురోజుకి అనుమానం పెరిగిపోయింది. అక్టోబర్ 27న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపంలో ఉన్న భర్త కర్రతో ఫాతిమా తలపై కొట్టాడు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడని పోలీసులు తెలిపారు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఫ్యాన్ కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకుని చనిపోయందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడని పోలీసులు వివరిచారు. తమ విచారణలో ఈ నిజం వెలుగు చూసిందన్నారు.
ఫాతిమా మృతికి అసలు కారణం తెలిసి కుటుంబసభ్యులు, స్థానికులు షాక్ తిన్నారు. టిక్ టాక్ ఎంత పని చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానంతో భార్యని కడతేర్చిన భర్తని కఠినంగా శిక్షించాలని ఫాతిమి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.