Tragedy: భూత్పూర్‌లో ఘోరం.. ముగ్గురు పిల్లలతో బావిలోకి దూకిన తల్లి.. భర్త మీద కోపంతో
వ్యవసాయ పొలంలో రెండో బోరు వేసే విషయంలో భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. భర్త బీరయ్య తన మాట వినడం లేదని భార్య ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
- Naveen
- Published On : March 12, 2026 / 06:46 PM IST
Well Representative Image (Image Credit To Original Source)
- పొలంలో రెండో బోరు వేసే విషయంలో భార్య, భర్తల మధ్య గొడవ
- భర్త తన మాట వినడం లేదని భార్య అఘాయిత్యం
- ముగ్గురు పిల్లలను బావిలోకి తోసేసిన తల్లి
Tragedy: దంపతుల మధ్య గొడవలు పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. చేయని తప్పునకు పసి పిల్లలు బలైపోతున్నారు. తల్లిదండ్రుల మధ్య గొడవలకు వారి ప్రాణాలు పోతున్నాయి. భర్త మీద కోపంతో భార్య, భార్య మీద ప్రతీకారంతో భర్త.. పిల్లలను బలి తీసుకుంటున్నారు. ఇద్దరిలో ఎవరికి కోపం వచ్చినా పిల్లలపై ప్రతాపం చూపుతున్నారు. తాజాగా భర్తతో గొడవపడిన భార్య.. తన ముగ్గురు పిల్లలను బావిలోకి తోసేసింది.
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది. చిన్న పాటి వివాదం నిండు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కన్న తల్లే తన ముగ్గురు పిల్లలను బావిలోకి తోసేంది. అనంతరం తాను కూడా బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు ఆడ పిల్లలు జ్యోతి (14), శైలజ (12) తో సహా తల్లి జంగమ్మ (40) మృతి చెందారు. కుమారుడు జస్వంత్ బావిలో చెట్టు వేర్లు పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు.
వ్యవసాయ పొలంలో రెండో బోరు వేసే విషయంలో భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. భర్త బీరయ్య తన మాట వినడం లేదని భార్య అఘాయిత్యానికి పాల్పడింది. ఆవేశానికి లోనైన భార్య జంగమ్మ తన ముగ్గురు పిల్లలను బావిలోకి తోసేసి తాను కూడా బావిలోకి దూకింది. ఈ ఘటనలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కుమారుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. క్షణికావేశంలో జంగమ్మ చేసిన పని పిల్లల ప్రాణాలు తీసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అభంశుభం తెలియని పిల్లలు ఏం పాపం చేశారు? అంటూ కుటుంబసభ్యులు, స్థానికులు బోరున విలపించారు. ఎంత పని చేశావు జంగమ్మ అంటూ గుండెలు బాదుకున్నారు. అప్పటివరకు ఆడుకుంటూ తమ కళ్ల ముందు కనిపించిన పిల్లలు ఇకలేరు అనే వార్తను కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి రోదనలతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.
వ్యవసాయ పొలంలో బోరు వేయగా అందులో నీళ్లు పడలేదు. దీంతో రెండో బోరు వేయాలని భర్త అనుకున్నాడు. అయితే, భార్య జంగమ్మ అందుకు ఒప్పుకోలేదు. ఇప్పటికే అప్పుల్లో ఉన్నామని, రెండో బోరు వేస్తే మరింత అప్పుల భారం పెరుగుతుందని చెప్పింది. రెండో బోరు వేయొద్దని భర్తను కోరింది. అయితే, భర్త ఆమె మాటను పట్టించుకోలేదు. దీంతో ఆవేశానికి లోనైన భార్య జంగమ్మ తన ముగ్గురు పిల్లలను బావి దగ్గరికి తీసుకెళ్లి బావిలోకి తోసేసింది. తర్వాత తను కూడా బావిలోకి దూకింది. విషయం తెలిసి గ్రామస్తులు బావి దగ్గరికి వెళ్లేసరికి తల్లి, ఇద్దరు ఆడ పిల్లలు చనిపోయారు. కొడుకు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read: గ్యాస్ అయిపోయిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి.. గ్యాస్ ఇబ్బందులకు చెక్..!
