Moradabad Incident: దారుణం.. 84 సార్లు కత్తితో పొడిచి.. సోదరి దారుణ హత్య

బాధ్యతగా ఉండాలని మంచి మాటలు చెప్పింది. అలా మంచి చెప్పడమే ఆమె పాలిట శాపమైంది. కోపంతో రగిలిపోయిన హార్దిక్ దారుణానికి ఒడిగట్టాడు.

  • Published On : March 15, 2026 / 12:38 AM IST

Representative Image (Image Credit To Original Source)

Moradabad Incident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ లో దారుణం జరిగింది. సోదరిని సోదరుడే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. 84 సార్లు కత్తితో పొడిచి మరీ ఆమెను చంపేశాడు. దీనికి కారణం మంచి చెప్పడమే. నాకే మంచి మాటలు చెబుతావా అంటూ కోపంతో ఊగిపోయిన సోదరుడు.. తన సోదరిని అత్యంత పాశవికంగా హత్య చేశాడు.

ఆమె పేరు హిమాశిఖ. అతడి పేరు హార్దిక్. ఇద్దరూ ట్విన్స్. హార్దిక్ ఏడాదిన్నర క్రితం వరకు ఇంజినీర్‌గా పని చేశాడు. తర్వాత జాబ్ మానేశాడు. ఉద్యోగం వదిలేశాక అతడు సోషల్ మీడియాకు బానిసగా మారాడు. ఎక్కువ సమయం అందులోనే గడిపేవాడు. అంతేకాదు ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఈ విషయాలలో సోదరుడిని హిమాశిఖ పలుమార్లు మందలించింది. బాధ్యతగా ఉండాలని మంచి మాటలు చెప్పింది. అయితే, హార్దిక్ కు ఇది నచ్చలేదు. తనను మందలించిన సోదరిపై కక్ష పెంచుకున్నాడు. సోదరిని అత్యంత కిరాతకంగా చంపాడు. 84సార్లు కత్తితో పొడిచాడు. ఆపై సర్‌ప్రైజ్ అంటూ తల్లికి సోదరి డెడ్‌బాడీ చూపించాడు. ఆమెపైన కూడా దాడి చేశాడు.

కెరీర్, ప్రేమ వ్యవహారంపై గొడవలు..

కెరీర్ గురించి, అమ్మాయితో ప్రేమ వ్యవహారం గురించి హార్దిక్, హిమాశిఖ మధ్య పలుమార్లు వాదనలు జరిగాయి. ఈ వ్యవహారంలో ఇరువురి మధ్య విబేధాలు తలెత్తాయి.

హార్దిక్, హిమాశిఖ కొంతకాలంగా గురుగ్రామ్‌లో ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం వరకు ఒక కంపెనీలో పని చేసిన హార్దిక్ ఆ తర్వాత జాబ్ ని వదులుకుని సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాడు. హార్దిక్ ప్రవర్తనలో ఇటీవలి కాలంలో చాలా మార్పు వచ్చిందని, అతను అర్థరాత్రి వరకు మొబైల్ ఫోన్‌కు అతుక్కుపోయి ఆన్‌లైన్‌లో చాట్ చేస్తున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా పూణేకు చెందిన ఒక ముస్లిం మహిళతో హార్దిక్ స్నేహం చేశాడని, ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది.

అయితే కవల సోదరి హిమశిఖ, తల్లి నీలిమకు ఇది నచ్చలేదు. తరచుగా హార్దిక్ కు సలహాలు ఇచ్చేవారు. నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదనే వారు. కెరీర్ పై దృష్టి పెట్టాలని సూచించే వారు. మార్చి 6వ తేదీన సాయంత్రం ఇలాంటి చర్చే జరిగింది. ఆ చర్చ తోబుట్టువుల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. ఆవేశంతో ఊగిపోయిన హార్దిక్ కూరగాయల కత్తిని తీసుకుని తన సోదరిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె స్పాట్ లోనే మరణించింది. పోస్టుమార్టం నివేదికలో హిమశిఖ శరీరంపై 84 కత్తిపోట్లు ఉన్నట్లు తెలిసి అంతా షాక్ అయ్యారు.

ఆ తర్వాత హార్దిక్ తన తల్లిని కలిశాడు. నీకో సర్ ప్రైజ్ అంటూ హిమాశిఖ డెడ్ బాడీని ఆమెకు చూపించాడు. దీంతో తల్లి నీలిమ బిత్తరపోయింది. భయంతో కేకలు వేసింది. హార్దిక్ తన తల్లిపైనా దాడి చేశాడు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు హార్ధిక్ ను అరెస్ట్ చేశారు.

కెరీర్‌పై దృష్టి పెట్టాలని, ప్రేమ సంబంధాలకు దూరంగా ఉండాలని తరుచూ తన సోదరి తనకు సలహాలు ఇవ్వడం తనకు నచ్చలేదని, ఆమెపై తనకు కోపం పెరిగిపోయిందని వెల్లడించాడు. నాకే సలహాలు ఇస్తావా అంటూ ఆమెను చంపేశానని అతడు పోలీసులతో చెప్పాడు.