హైదరాబాద్ లోని పంజాగుట్ట చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. జీహెచ్‌ఎంసీ చెత్త డంపింగ్ లారీ డ్రైవర్ డప్పు రాజుతో పాటు మరో ఉద్యోగి గుప్తాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో మరో ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు పరారీలో ఉన్నారు.
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నిర్వహించేందుకు అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడిమల్ల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్‌లో ఏప్రిల్ 12 శుక్రవారం అర్ధరాత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ ఏప్రిల్ 13 శనివారం ఉదయం తొలగించేందుకు యత్నించారు. అక్కడే ఉన్న దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాదోపవాదాలు జరిగాయి. ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో పంజాగుట్ట ఇన్స్‌పెక్టర్ మోహన్, పశ్చిమండల టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, డీడీ విభాగం ఏసీపీ శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. ధర్నా చేస్తున్న దళిత సంఘాల నాయకులను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం విగ్రహాన్ని తొలగించారు. అంబేద్కర్ విగ్రహాన్ని చెత్త తరలించే వాహనంలో తీసుకెళ్లి జవహర్‌నగర్‌లోని రాంకీ డంప్ యార్డులో పడేశారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి కనీస గౌరవం ఇవ్వకుండా ధ్వంసం చేయడమే కాకుండా చెత్తవేసే ప్రదేశంలో పడేయడం ఎంతవరకు సమంజసమని దళిత సంఘాల నాయకులు ప్రశ్నించారు. అనంతరం దళిత సంఘాల నాయకులు మేడ రవి ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులపై స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.