గుంటూరు జిల్లాలోని వినుకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహేందర్ రెడ్డి (25), పోలేపల్లి అశోక్ (24) అనే ఇద్దరు యువకులు కారులో వెళ్తున్నారు. తెల్లవారుజామున వినుకొండలోని నిర్మల హైస్కూల్ సమీపంలోకి వెళ్లగానే కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. అనంతరం కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతితో ఇరువురి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
కారు నుజ్జునుజ్జు అయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేశారా లేదా నిద్ర మత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.