Warangal District Court: ప్రేమోన్మాదికి ఉరిశిక్ష.. వరంగల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
20 నెలల విచారణ అనంతరం నిందితుడు మేకల నాగరాజు అలియాస్ బన్నీని దోషిగా తేల్చింది వరంగల్ న్యాయస్థానం.
- Naveen
- Updated on- May 20, 2026 / 08:47 PM IST
Warangal District Court: వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాదికి ఉరిశిక్ష పడింది. 2024లో జూలైలో ప్రియురాలి తల్లిదండ్రులను నరికి చంపాడు ప్రేమోన్మాది నాగరాజు. చెన్నారావుపేట మండలంలోని 16 చింతల తండాలో ఈ ఘటన జరిగింది. ప్రియురాలి తల్లిదండ్రులు సుగుణ, శ్రీను దంపతులను నరికి చంపాడు నాగరాజు. ప్రియురాలు, ఆమె సోదరుడిపైనా దాడి చేశాడు. ఈ కేసులో విచారణ అనంతరం ఉరిశిక్ష ఖరారు చేశారు వరంగల్ జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తి.
బీఎన్ఎస్ సెక్షన్లు 333, 103(1), 109, 352(3), ఆర్మ్స్ ఆక్ట్ సెక్షన్ 25(1A) కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 20 నెలల విచారణ అనంతరం నిందితుడు మేకల నాగరాజు అలియాస్ బన్నీని దోషిగా తేల్చింది వరంగల్ న్యాయస్థానం. దోషి నాగరాజుకు ఉరిశిక్షతో పాటు, 5 వేల రూపాయల జరిమానా విధించింది. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బానోతు శ్రీను, సుగుణ దంపతుల కుమార్తె దీపిక, గూడూరు మండలానికి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ 2023లో ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను కాదని ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. యువతి తన పేరెంట్స్ తో వెళ్లిపోయింది. అయితే, ప్రియురాలికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే సమాచారం తెలుసుకున్న నాగరాజు రగిలిపోయాడు. 2024 జూలై 10న రాత్రి మద్యం తాగి కత్తితో యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటి బయట పడుకున్న సుగుణ, శ్రీనుపై కత్తితో దాడి చేశాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన యువతి, ఆమె సోదరుడిపైనా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో సుగుణ స్పాట్ లోనే చనిపోయింది. శ్రీనుని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
Also Read: తెలంగాణలో రేపు భగభగలే.. బయటకు రావొద్దు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
