ఎలాంటి సర్టిఫికెట్ అయినా డబ్బులిస్తే చిటికెలో చేతిలో పెడతారు..! వెలుగులోకి నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

రెన్యువల్ కోసం వరంగల్ తహసిల్దార్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు తీసుకున్న వరంగల్ మండల తహసిల్దార్ ఇక్బాల్.. అది నకిలీదని, తన సంతకం కాదని గుర్తించారు.

Fake Certificated Racket Busted : ATC..అంటే..ఎనీ టైం సర్టిఫికెట్. కానీ.. కావాలి మనీ…! కులమైనా..ఆదాయమైనా..ఇట్టే ఇచ్చేస్తారు. ఫ్యామిలీ మెంబర్ పత్రమైనా..డిపెండెంట్ పత్రమైనా కాసులిస్తే చేతిలో పెట్టేస్తారు. సంతకం..స్టాంప్..అన్నీ ఉంటాయి. అధికారులు జారీ చేసేది ఒరిజినల్…ఇది డూప్లికేట్‌..మిగతాదంతా సేమ్‌ టూ సేమ్.

కాసులు ఇస్తే చాలు కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్లు చేతిలో పెడతారు. చేతులు తడిపితే చాలు.. ఫ్యామిలీ మెంబర్, డిపెండెంట్, మనీ లెండరింగ్ సర్టిఫికెట్లు చిటికెలో చేతిలో పెడతారు. ఎలాంటి సర్టిఫికెట్ అయినా సరే.. డబ్బులిస్తే నిమిషాల్లో జారీ చేస్తారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీలో వాళ్లకు వాళ్ళే సాటి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 650కి పైగా నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసి రెవెన్యూ అధికారులకు షాక్ ఇచ్చిన కేటుగాళ్లను వరంగల్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

నకిలీ సర్టిఫికెట్ల బాగోతం వరంగల్‌ను షేక్ చేసింది. ఓ ముఠా ఏకంగా తహసిల్దార్ సంతకంతో పాటు నకిలీ స్టాంపులు తయారు చేయించి, ఇంటి నుండే సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ కేటుగాళ్లు జారీ చేసిన నకిలీ సర్టిఫికెట్ల బాగోతం తెలియక సర్టిఫికెట్ రెన్యూవల్ కోసం తహసిల్దార్ కార్యాలయానికి ఓ బాధితుడు వెళ్లగా అసలు విషయం బయట పడింది. నకిలీ అని గమనించిన వరంగల్ తహసీల్దార్ మట్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీగలాగితే డొంక కదిలింది. ప్రధాన సూత్రధారి తోపాటు ఇప్పటివరకు ఎనిమిది మంది అరెస్టు అయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ నగరంలోని ఎల్లంబజారుకు చెందిన సతీష్ ఈ ఫేక్‌ దందాకు కర్త, కర్మ, క్రియ. ఇతను తహసిల్దార్ కార్యాలయంలో పని చేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో మిలాఖత్ అయి నకిలీ సర్టిఫికెట్ల దందాకు తెర లేపాడు. కాసులు ఇస్తే చాలు కులం, ఆదాయం, నివాసం, ఫ్యామిలీ మెంబర్, డిపెండెంట్, మనీ లెండరింగ్ సర్టిఫికెట్లను తయారు చేసి ఐదు వేలు, పది వేల రూపాయలకు విక్రయించేవాడు.

అయితే బాలాజీనగర్‌కు చెందిన ఓ యువకుడు ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించుకునేందుకు గతంలో సతీష్ వద్ద మనీ లెండరింగ్ సర్టిఫికెట్ 5 వేలకు తీసుకున్నాడు. ఈ సర్టిఫికెట్ గడువు ఆగస్టు నెలలో ముగిసింది. దీంతో రెన్యువల్ కోసం వరంగల్ తహసిల్దార్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు తీసుకున్న వరంగల్ మండల తహసిల్దార్ ఇక్బాల్.. అది నకిలీదని, తన సంతకం కాదని గుర్తించారు. ప్రభుత్వ స్టాంపు కూడా తప్పుగా ఉందని గమనించి మట్వాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాను గతేడాది ఎవరికీ కూడా మనీ లెండరింగ్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే కాకుండా చాలామంది వద్ద డబ్బులు తీసుకొని నకిలీ సర్టిఫికెట్లు జారీ చేశారని.. వారందరిపై చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేశారు.

తహసిల్దార్ ఇక్బాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తీగ లాగితే డొంక కదిలింది. తహసిల్దార్ సంతకాన్ని, ప్రభుత్వ ముద్రను ఫోర్జరీ చేసి నకిలీ ఆదాయం, డిపెండెంట్, ఫ్యామిలీ మెంబర్, మనీ లెండరింగ్ సర్టిఫికెట్లు, వివిధ విలువైన సర్టిఫికెట్స్ క్షణాల్లో జారీ చేసినట్లు గుర్తించారు. తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది పాత్రధారులుగా ఈ బాగోతం జరిగినట్లు పోలీసులు తేల్చారు. నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేయడానికి సహకరించిన డిటిపి, స్టాంపు వెండర్, సంతకం ఫోర్జరీ, దళారి, నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న వారితో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు పంపారు.

నిందితులు ఇప్పటివరకు 460 మందికి 640 నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అవసరాన్ని బట్టి ఒక్కో సర్టిఫికెట్‌కు 5 వేల రూపాయల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు.

Also Read : 100 పెడితే రెండొందలు ఇస్తామంటారు, ఆశ పడ్డారో ఖతమే.! సైబర్ నేరగాళ్ల కొత్త రకం ఫ్రాడ్

ట్రెండింగ్ వార్తలు