100 పెడితే రెండొందలు ఇస్తామంటారు, ఆశ పడ్డారో ఖతమే.! సైబర్ నేరగాళ్ల కొత్త రకం ఫ్రాడ్
కేసు నమోదు చేసిన పోలీసులు..టెక్నాలజీ అధారంగా నిందితులను గుర్తించి చెన్నైలోని సలయూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు.
Warangal Cyber Fraud : మంచి తరుణం మించినా దొరకదు.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం.. వంద పెడితే రెండొందలు.. రెండొందలకు నాలుగు వందలు.. డబ్బులు పెట్టండి.. డబుల్ పట్టుకెళ్లండి..అబ్బ..! ఏమీ ఆఫరూ…. సూపరుగా ఉందంటూ ఎగబడ్డారో.. మోసపు వలలో చిక్కుకున్నట్లే. సైబర్ నేరగాళ్ల కొత్త రకం ఫ్రాడ్ ఇది..
సుమారు 3 కోట్లకు పైగా నగదు అపహరణ..
సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులిద్దరూ తెలంగాణలో మొత్తం 15 కేసుల్లో సుమారు 3 కోట్లకు పైగా నగదును అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడు చెందిన జసిల్, ప్రీతి దంపతులు.. ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. నిందితుల నుంచి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో పాటు విలువైన సమాచారంతో కూడిన పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అంటూ ప్రచారం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తమిళనాడు తాంబరం పట్టణానికి చెందిన జసిల్, ప్రీతి భార్యాభర్తలు. వీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నమ్మిన జనాలతో గోల్డ్‌మ్యాన్ సచ్, యాం బ్రాండింగ్స్ అనే ఫేక్ వెబ్‌సైట్లలో భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టిస్తున్నారు. ఇలాంటి పెట్టుబడుల కోసం నిందితులు ముందే.. రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాల్లో జమైన డబ్బును విత్ డ్రా చేసి ఈ సైబర్ జంట జల్సాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇదే రీతిలో హనుమకొండకు చెందిన ఒక వ్యక్తి ఈ సైబర్ నేరగాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్మాడు. వీరు సూచించిన నకిలీ వెబ్ సైట్లలో సూమారు 28 లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టి మోసపోయినట్లుగా గుర్తించాడు. దీంతో బాధితుడు వరంగల్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులను అశ్రయించాడు.
15 నేరాల్లో రూ.3 కోట్లకు పైగా డబ్బు వసూళ్లు..
కేసు నమోదు చేసిన పోలీసులు..టెక్నాలజీ అధారంగా నిందితులను గుర్తించి చెన్నైలోని సలయూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు. ఆ తర్వాత స్థానిక జిల్లాలో కోర్టులో హజరు పరిచారు. అనంతరం సైబర్ విభాగం పోలీసులు నిందితులను సెప్టెంబర్ 2న వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు తీసుకొచ్చారు. అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు విచారించగా నిందితులు వరంగల్ కమిషనరేట్ పరిధిలో రెండు సైబర్ నేరాలకు పాల్పడినట్లుగా అంగీకరించారు. అలాగే దేశ వ్యాప్తంగా సూమారు 150కి పైగా సైబర్ నేరాలకు పాల్పడి.. ప్రజల నుంచి 15 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో 15 నేరాల్లో మూడు కోట్లకు పైగా డబ్బు వసూళ్ళు చేసినట్లు వెల్లడించారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని మోసాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బులు వస్తాయన్న ఆశతో పెట్టుబడులు పెడితే మాత్రం సైబర్ నేరగాళ్ల వలలో పడ్డట్లే అని హెచ్చరిస్తున్నారు.