మేడ్చల్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే భార్య కడతేర్చింది. తన సుఖం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. రాజ బొల్లారం గ్రామ పంచాయతీ అక్బార్జాపేటకు చెందిన మహంకాళి కృష్ణ(36) వెల్డింగ్ పని చేస్తుంటాడు. అతనికి భార్య లక్ష్మి ఉంది. సంతానం లేదు. 2014లో కృష్ణ తన ఆటోను అదే గ్రామానికి చెందిన గుంటి బాల్ రాజ్ కు అమ్మడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కృష్ణ ఇంటికి బాల్ రాజ్ తరచూ వస్తుండేవాడు. ఈ క్రమంలో లక్ష్మితో బాల్ రాజ్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. 8నెలల క్రితం లక్ష్మీ, బాల్ రాజ్ ల విషయం కృష్ణకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని భార్యకు చెప్పాడు. అయినా ఆమె వినిపించుకోలేదు.
పైగా తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్తను చంపాలనుకుంది లక్ష్మి. పలుమార్లు భర్తకు నిద్రమాత్రలు ఇచ్చింది. ఎలాగో బతికి బయటపడ్డాడు కృష్ణ. దీంతో భర్త హత్యకు లక్ష్మి ప్లాన్ చేసింది. ఏప్రిల్ 8న రాత్రి కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఇదే అదనుగా భావించిన లక్ష్మి తన ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది. అదే సమయంలో కృష్ణకు మెలకువ వచ్చింది. భార్యను, ఆమె ప్రియుడిని చూసి షాక్ తిన్నాడు. వెంటనే బయటకు పరుగెత్తాడు.
ఇంతలో లక్ష్మి, బాల్ రాజ్ లు ఇస్త్రీ పెట్టే తీగను కృష్ణ గొంతుకు బిగించి దారుణంగా హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. భర్తను భార్యే మర్డర్ చేసిందని గుర్తించారు. లక్ష్మి, బాల్ రాజ్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. తన సుఖం కోసం భర్తను భార్యే కడతేర్చడం స్థానికులను షాక్ కు గురి చేసింది. దారితప్పిన ఆమెని కఠినంగా శిక్షించాలని మృతుడి బంధవులు పోలీసులను కోరారు. బాల్ రాజ్ మరణంతో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది.