పెళ్లి చేయమని అడిగిన కూతురు పై దాడి

  • Publish Date - February 8, 2020 / 03:54 AM IST

పెళ్లి చేయమని అడిగిన కూతురిపై దాడి చేసి గాయపరిచిన తల్లి తండ్రుల ఉదంతం నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గల గూడెంకు చెందిన తీర్పారి కవిత(30) తనకు వివాహాం చేయమని తల్లి తండ్రులు లక్ష్మమ్మ, బుచ్చయ్య, అన్న గోవర్థనత్ తో కొంతకాలంగా గొడవ పడతోంది.బుచ్చయ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు , ఒక కుమారుడు ఉన్నారు. కవిత ఎమ్మెస్సీ కెమిస్ట్రీి  పాసయ్యింది. తన చదువుకు తగిన వరుడిని, ప్రభుత్వ ఉద్యోగస్తుడిని  చూసి పెళ్ళి చేయమని…. లేదంటే కుటుంబానికి చెందిన 12 ఎకరాల భూమిలో కనీసం 2 ఎకరాలైనా తన పేరున రిజిష్ట్రేషన్ చేయాలని పలుమార్లు తల్లి తండ్రులను కోరింది.  

కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం  చూడక, భూమి రిజిష్టర్ చేయక నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల  కౌన్సిలింగ్ లో భూమి రాసి ఇస్తామని తల్లితండ్రులు ఒప్పుకున్నారు. అప్పటినుంచి రెండు ఎకరాల భూమి కోసం కవిత చట్టపరంగా పోరాడుతూ తల్లిదండ్రులు, అన్నపై ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న తల్లిదండ్రులు లక్ష్మమ్మ, బుచ్చయ్య, అన్న గోవర్థన్‌లు శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న కవితపై కర్రలతో దాడిచేశారు. 

అంతటితో ఆగకుండా రాయితో తలపై బలంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ రజనీకర్‌ సంఘటనా స్థలాన్ని చేరుకొని కవితను చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కవిత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన తల్లిదండ్రులు లక్ష్మమ్మ, బుచ్చయ్య, అన్న గోవర్థన్‌లపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రజనీకర్‌ తెలిపారు.