డాక్టర్లు గ్రూపుగా ప్రయత్నించినప్పటికీ ఆ మహిళ ప్రాణాలు కాపాడలేకపోయారు. కడుపులో నొప్పి అంటూ వస్తే.. సమస్యను పెద్దది చేసి చివరికి ఆమె ప్రాణాలు పోయేలా చేశాడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్. వివరాల్లోకి వెళితే.. డిసెంబరు 27న తమిళనాడులోని కద్దలూరు జిల్లాలో వృద్ధాచలం హాస్పిటల్‌కు ప్రియా అనే గర్భిణీ కడుపునొప్పి అంటూ వెళ్లింది.
పరీక్షలు చేసిన డాక్టర్ సిజేరియన్ చేయాల్సిందేనని చెప్పాడు. అదే రోజు రాత్రి ఆపరేషన్ జరిగింది. నాలుగు రోజుల తర్వాత నొప్పి తీవ్రత పెరిగిందంటూ మరోసారి వచ్చింది. చికిత్సను ప్రశ్నిస్తుందని జిప్‌మర్ ప్రాంతంలోని మరో హాస్పిటల్‌కు రిఫర్ చేశాడు. అక్కడి డాక్టర్లు మహిళ ఇన్ఫెక్షన్ల కారణంగా బాధపడుతూ ఉండొచ్చని అనుమానించారు.
ఓ గ్రూపుగా మహిళకు ఆపరేషన్ చేయాలనుకున్నారు. ఇందులో భాగంగానే వారికి కొన్ని దూది పోగులు ఉండడం గమనించారు. వాటిని తొలగించే క్రమంలో ఎక్కువ మొత్తంలో దూది కనిపించింది. ఎంతో జాగ్రత్తగా దానిని తీసేసినప్పటికీ అప్పటికే ఇన్ఫెక్షన్ కావడంతో ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆమె మరణం తర్వాత వైద్య బృందంతో పాటు ఆరోగ్య శాఖ అడిషనల్ డైరక్టర్, జాయింట్ డైరక్టర్ లు వృద్ధాచలం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు.
ప్రాథమిక విచారణ జరిపారు. నిర్దారణకు వచ్చిన తర్వాత సిబ్బందికి, వైద్యుడికి షోకాజ్ నోటీసులు పంపారు. పూర్తి విచారణ తర్వాత సర్జరీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. బాధితురాలి కుటుంబీకులు బుధవారం హాస్పిటల్ ఎదుట ఆందోళన జరిపారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టడంతో పాటు కేసు నమోదుచేసి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు.