Bihar: పెళ్లిలో దారుణం.. అందరి ముందే పెళ్లి కూతురిని కాల్చిన ప్రియుడు.. వీడియో వైరల్

ఇది వేడుకలో భాగమని మేము అనుకున్నాము. పటాకులు పేల్చారని భావించారు.

  • Published On : February 25, 2026 / 04:43 PM IST

Bihar Wedding Shooting Representative Image (Image Credit To Original Source)

  • పెళ్లి వేడుకలో కాల్పుల కలకలం
  • అతి సమీపం నుంచి వధువుని కాల్చిన ప్రియుడు
  • తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటోందని ఘాతుకం

Bihar: బిహార్ రాష్ట్రం బక్సర్ జిల్లాలో ఘోరం జరిగింది. పెళ్లి వేడుకలో విషాదం అలుముకుంది. పెళ్లి కూతురిపై ఆమె ప్రియుడు కాల్పులు జరిపాడు. తాను ప్రేమించిన అమ్మాయి మరొకరిని వివాహం చేసుకోవడం నచ్చని ప్రియుడు.. ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కాబోయే భర్త పక్కనే ఉండగా, అందరూ చూస్తుండగానే.. అతి సమీపం నుంచి వధువుని గన్ తో కాల్చాడు.

ఈ సంఘటన మంగళవారం చౌసాలోని పెళ్లి కూతురి వదిన ఇంట్లో జరిగింది. అక్కడ వివాహం జరుగుతోంది. బంధుమిత్రులు తరలివచ్చారు. అంతా సందడిగా ఉంది. వధువు ఆర్తి, వరుడు పూల దండలతో స్టేజ్ పైన ఉన్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఆర్తిని ఆమె ప్రియుడు తుపాకీతో కాల్చాడు. అతి దగ్గరి నుంచి ఆమె కడుపులో తుపాకీతో కాల్చాడు. దీంతో వధువు అక్కడే కుప్పకూలింది. అసలేం జరిగిందో అక్కడున్న వారికి అర్థం కాలేదు. అంతా షాక్ లో ఉండిపోయారు. ఇదంతా ఫోటోగ్రాఫర్ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ప్రియుడు వీడియోలో పూర్తిగా కనిపించలేదు. అతి దగ్గరి నుంచి ఆర్తి కడుపులో కాల్చి అక్కడి నుండి పారిపోయాడు. అకస్మాత్తుగా జరిగిన కాల్పులతో వివాహానికి వచ్చిన అతిథులు భయాందోళనకు గురయ్యారు. భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ఎవరైనా పటాకులు కాల్చారేమో అని అంతా అనుకున్నాము, కానీ తుపాకీతో కాల్చాడని తెలిసి అంతా షాక్ కి గురయ్యామని బంధువులు తెలిపారు.

”అకస్మాత్తుగా వేదిక దగ్గర నిప్పురవ్వలు కనిపించాయి. ఇది వేడుకలో భాగమని మేము అనుకున్నాము. పటాకులు పేల్చారని భావించాము. కానీ మేము దగ్గరగా వెళ్లి చూస్తే ఆర్తిపై కాల్పులు జరిగినట్లు గమనించాము. వెంటనే వరుడు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు” అని పెళ్లికి వచ్చిన బంధువు ఒకరు చెప్పారు.

ఆర్తి కుప్పకూలే ముందు తుపాకీ కాల్పుల శబ్దం విన్నట్లు మరో కుటుంబసభ్యుడు తెలిపాడు. “అతను ఆమెను కాల్చి పారిపోయాడు. ఆమె భర్త ఆమెను ఎత్తుకుని ఆసుపత్రికి తరలించాడు” అని ఆయన అన్నాడు. ఆర్తిని మొదట స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం వారణాసికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఆర్తికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని వధువు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: మీరు తీసుకునే పాలు స్వచ్ఛమైనవా.. కల్తీవా..? ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో ఇలా గుర్తించండి..