అత్తామామల వేధింపులు భరించలేక ముంబై లోని మేనమామ ఇంట్లో సూసైడ్ చేసుకుంది.
హైదరాబాద్: అత్తింటివారి వరకట్న వేధింపులకు మరో అబల బలైంది. హైదరాబాద్ రామాంతాపూర్‌కు చెందిన జువాడి శ్రీలత అత్తామామల వేధింపులు భరించలేక ముంబై లోని మేనమామ ఇంట్లో సూసైడ్ చేసుకుంది. దీంతో ఆమె ఒక్కగానొక్క కూతురు అనాథ అయ్యింది. శ్రీలతకు 2011లో రామాంతపూర్‌కు చెందిన వంశీరావుతో వివాహం జరిగింది. వంశీరావు యూకేలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి అనంతరం 2012 లో శ్రీలతను కూడా యూకే తీసుకెళ్లారు. కొంత కాలానికి వారికి ఆడపిల్ల పుట్టింది. ఆడ పిల్ల పుట్టినప్పటి నుంచి అత్త మామలు అదనపు కట్నం కోసం వేధించసాగారు. కూతురును పెడుతున్న బాధలు చూడలేక శ్రీలత తల్లి చంద్రకళ 2016 లో మరణించింది.
తల్లి మరణించటంతో శ్రీలత భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చి వెళ్లింది. లండన్ వెళ్లిన తర్వాత కూడా భర్త వేధింపులు ఆగకపోవటంతో 2018 లో అక్కడే ఒకసారి రైలుకింద పడి ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. అనంతరం 2018 జూన్ లో శ్రీలత పాపతో హైదరాబాద్ వచ్చిన వంశీరావు భార్యను పిల్లను రామాంతపూర్ లో దింపి లండన్ వెళ్లిపోయాడు. అప్పటినుంచి అత్తమామలు తిరిగి ఆమెను వేధించసాగారు.
ఇది తట్టుకోలేని ఆమె ముంబైలోని మేనమామ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం రాత్రి ఆమె మృతదేహాన్ని మేనమామ హైదరాబాద్ రామాంతపూర్ కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న అత్తమామలు జువ్వాడి రాజేశ్వర్‌రావు, ఆశాలతలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో రామంతాపూర్‌లో శ్రీలత మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. శ్రీలత మృతికి కారకులైన భర్త, అత్త మామలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరగకపోతే శ్రీలత మృతదేహాన్ని అత్తవారి ఇంట్లో పూడ్చిపెడతామని కుటుంబ సభ్యులు అంటున్నారు.