డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం

  • Publish Date - August 28, 2020 / 03:48 PM IST

అనంతపురం జిల్లా శెట్టూరులో దారుణం జరిగింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడు బాలికను నమ్మించి మోసం చేశాడు. బాలికను అత్యాచారం చేశాడు. శెట్టూరుకు చెందిన రాము అనే యువకుడి దగ్గర ఓ బాలిక డ్యాన్స్ నేర్చుకుంటోంది. బాలికపై కన్నేసిన రాము బాలికకు మాయమాటలు చెప్పాడు. ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. నువ్వు కాదంటే చచ్చిపోతానని నమ్మించాడు. అతడి మాటలు నిజమేనని నమ్మిన ఆ బాలిక అతని మోసానికి బలైంది. పథకం ప్రకారం గురువారం(ఆగస్టు 27,2020) తన ముగ్గురు స్నేహితుల సహకారంతో బాలికను శెట్టూరు చెరువుకట్ట సమీపంలోని తాతయ్య గుడి వద్దకు రప్పించాడు రాము.



స్నేహితుల సాయంతో బాలికను రప్పించి:
అక్కడి నుంచి వాహనంలో కళ్యాణదుర్గం మండలం గోళ్ల ఆంజనేయస్వామి దేవాలయం దగ్గరికి బాలికను తీసుకెళ్లాడు. ఆలయ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను కళ్యాణదుర్గం బైపాస్ లో బళ్లారి రోడ్డు మిట్టపై వదిలేశాడు. విషయం బాలిక తండ్రికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేశారు.

ఆడపిల్లకు రక్షణ ఏది?
ఆడపిల్లకు రక్షణ కరువైంది. నిర్భయ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, ఉరి శిక్షలు విధిస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. నమ్మించి నయ వంచనకు పాల్పడుతున్నారు. మాయ మాటలతో బాలికలను మచ్చిక చేసుకుని ఆ తర్వాత అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి నీచులను నడి రోడ్డులో కాల్చి పారేయాలని, స్పాట్ లోనే ఉరి తియ్యాలని, అప్పుడే ఇలాంటి తప్పుడు పనులు చేయాలనే ఆలోచన రాకుండా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు చట్టాలు తెస్తే సరిపోదని వాటిని అమలు చేసినప్పుడే ప్రయోజనం ఉంటుందని మహిళా సంఘాలు అంటున్నాయి. అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలని, గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా బెదిరించినా, బ్లాక్ మెయిల్ చేసినా.. బాధితులు భయపడకుండా ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.