Pubg Representative Image (Image Credit To Original Source)
PUBG Game: పబ్ జీ గేమ్ ఎంత ప్రమాదకరమో చెప్పే ఘటన ఇది. దాని వల్ల అనేక ప్రాణాలు పోతున్నాయి. చాలా మంది అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. తాజాగా పబ్జీ గేమ్ మరో ప్రాణం తీసింది. ఏకధాటిగా పబ్జీ గేమ్ ఆడుతూ ఓ కుర్రాడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి బీపీ 300 దాటింది. మెదడులోని నరాలు చిట్లి చనిపోయాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘోరం జరిగింది. మీరట్ కు చెందిన మహ్మద్ కైఫ్ (22) 4 నెలలుగా పబ్జీ (PUBG) గేమ్‌కు బానిసగా మారాడు. శుక్రవారం హెడ్‌ఫోన్స్ పెట్టుకుని గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. అలా అర్ధరాత్రి వరకు ఆడుతూనే ఉన్నాడు. దీంతో చెవులు, ముక్కు నుంచి రక్తం కారింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు కైఫ్ ని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం కైఫ్ చనిపోయాడు. మెంటల్ ప్రెజర్ వల్ల బీపీ 300 దాటిందని, బ్రెయిన్‌లోని నరాలు చిట్లి రక్తస్రావమైందని డాక్టర్లు తెలిపారు.
”పబ్జీ ఆడుతూ ఆడుతూ కైఫ్ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించాము. అక్కడ ప్రాథమిక చికిత్స అందించాము. మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించాం. కైఫ్ ని కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. కైఫ్ చనిపోయాడు” అని తల్లిదండ్రులు వాపోయారు.
”పదేళ్ల క్రితం కైఫ్ హై బీపీతో బాధపడుతున్నాడు. దీనికి సంబంధించి అతడికి ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నాం. అయితే, కైఫ్ పబ్జీ గేమ్ కి బానిసగా మారాడు. ఆ గేమ్ ఆడొద్దని ఎన్నోసార్లు చెప్పాం. ఎంతో బతిమాలాము. అయినా కైఫ్ లో మార్పు రాలేదు. గంటలు గంటలు ఫోన్ లో గేమ్స్ ఆడుతూ గడిపేవాడు. రీల్స్ కూడా చేసేవాడు. చివరికి తన ప్రాణాలే కోల్పోయాడు” అని కైఫ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.