Group-1 Exam : అక్టోబర్ 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష.. తొలిసారి బయోమెట్రిక్

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్‌-1లో టీఎస్‌పీఎస్సీ కీలక మార్పు చేసింది. తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశ పెట్టబోతుంది. తొలిసారిగా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా జంబ్లింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ 16వ తేదీన 33 జిల్లా కేంద్రాల్లో 1,019 సెంటర్లలో పరీక్ష జరగనుంది.

  • Published on- October 12, 2022 / 01:06 PM IST

TSPSC

Group-1 Exam  తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్‌-1లో టీఎస్‌పీఎస్సీ కీలక మార్పు చేసింది. తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశ పెట్టబోతుంది. తొలిసారిగా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా జంబ్లింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ 16వ తేదీన 33 జిల్లా కేంద్రాల్లో 1,019 సెంటర్లలో పరీక్ష జరగనుంది. ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్ల గురించి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్ధన్‌రెడ్డి వివరించారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ, కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలను వెల్లడించారు. గ్రూప్‌-1 పరీక్షల్లో కొత్తగా ఎన్నో సవరణలు చేశామని తెలిపారు. ప్రశ్నలను భారీగా జంబ్లింగ్‌ చేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఏ, బీ, సీ, డీ సిరీస్‌ల పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు వరుస క్రమంలో ఇచ్చేవారు.

కానీ ఇకపై ఎక్కువ సిరీస్‌లలో వచ్చేలా ప్రశ్నపత్రాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఆ ప్రశ్నలను కంప్యూటర్‌లో జంబ్లింగ్‌ చేశామని తెలిపారు. ఉదాహరణకు.. రాము, రాజేశ్‌ పక్కపక్కనే కూర్చున్నారు… రాముకు ఒకటో నంబర్‌లో ఒక ప్రశ్న వస్తే.. రాజేశ్‌కు అదే ఒకటో నంబర్‌లో మరో ప్రశ్న వస్తుంది. రాముకు 1వ నంబర్‌లో వచ్చిన ప్రశ్నకు 4 చాయిస్‌లు ఒకలా ఉంటే.. రాజేశ్‌కు అదే ప్రశ్నకు 4 చాయిస్‌లు రివర్స్‌లో వస్తాయి. తద్వారా మాస్‌ కాపీయింగ్‌కు చెక్‌ పెట్టామని పేర్కొన్నారు. బబ్లింగ్‌ చేసేటప్పుడు ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎవరైనా తమకు కేటాయించిన నంబర్‌ను ఓఎంఆర్‌ షీటులో సరిగా బబ్లింగ్‌ చేయకపోయినా, లేదా అభ్యర్థి, ఇన్విజిలేటర్‌ సంతకాలు లేకపోయినా అతని పేపర్‌ను మూల్యాంకనం చేయబోమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.

Groups Jobs: గ్రూప్స్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ముగిసిన మూడురోజుల్లో ప్రాథమిక కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ నెల 20లోపు ‘కీ’ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఆ తర్వాత నిపుణుల కమిటీ ఫైనల్‌ ‘కీ’ని ప్రకటిస్తుందన్నారు. గ్రూప్‌ -1 పరీక్షకు హాజరైన అభ్యర్థుల ఓఎమ్మార్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, పరీక్షకు హాజరైన వారందరి ఓఎమ్మార్‌ షీట్లను అభ్యర్థులు చూసుకోవచ్చని తెలిపారు. కీతో పోల్చుకుని ఎన్ని మార్కులొస్తాయో తెలుసుకోవచ్చని చెప్పారు. ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా ఫలితాల్లో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

దరఖాస్తు సమయంలో కొంతమంది ఫొటోలు సరైనవి ఇవ్వలేదని.. ఫలితంగా హాల్‌టికెట్‌లో ఫొటో సరిగా లేకపోతే.. అభ్యర్థులు మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకొని గెజిటెడ్‌ ఆఫీసర్‌తో సంతకం చేయించుకుని పరీక్ష కేంద్రానికి రావాలని చెప్పారు. అప్పుడే ఆ అభ్యర్థిని పరీక్షకు అనుమతిస్తామని సూచించారు. అందరూ త్వరగా www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, సందేహాలు ఉంటే టీఎస్‌పీఎస్సీని సంప్రదించాలన్నారు.
పరీక్ష హాలులోకి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించబోమని తెలిపారు.

Harish Rao On Jobs : త్వరలో మరో 3వేల ఉద్యోగాలు భర్తీ-హరీశ్ రావు

పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలు కూడా ఉండవు… అందుకే ప్రతి అరగంటకు ఓ సారి అలర్ట్‌ చేసేలా గంట మోగిస్తామని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి చెప్పులు మాత్రమే వేసుకొని రావాలని.. మెహిందీలు వేసుకొని వస్తే అనుమతించబోమని తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైనప్పుడు ఆ అభ్యర్థి వేలిముద్రలు తీసుకుంటామని చెప్పారు. మళ్లీ మెయిన్‌ పరీక్షకు వచ్చినప్పుడు బయోమెట్రిక్‌ తీసుకుంటామని చెప్పారు. వేలిముద్ర తీసుకోగానే అభ్యర్థి ఫొటోతోపాటు పూర్తి వివరాలు తెలిసిపోతాయని తెలిపారు. ఎవరైనా ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని, అభ్యర్థిపై జీవితకాల నిషేధం విధిస్తామని హెచ్చరించారు.

గ్రూప్‌-1 పరీక్ష ఫలితాలను 2 నెలల్లోనే విడుదల చేస్తామని, ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మరో నెల ఆలస్యం కావచ్చన్నారు. ఫిబ్రవరిలోనే మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. క్వాలిఫై మార్కుల కోసం నిర్వహించే ఇంగ్లిష్‌ పరీక్షను సైతం మెయిన్స్‌లో భాగంగానే నిర్వహిస్తామని పేర్కొన్నారు. గ్రూప్‌-1లో సెలక్ట్‌ అయ్యే అభ్యర్థులు భవిష్యత్తులో ఐఏఎస్‌లుగా కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే గ్రూప్‌ -2, 3 ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్లు ఇస్తామని, దీనికోసం కావాల్సిన కసరత్తు పూర్తయిందని వెల్లడించారు. గిరిజన రిజర్వేషన్ల కోసం వెయిట్‌ చేస్తున్నామని.. అవి ఖరారు కాగానే నోటిఫికేషన్లు ఇచ్చేస్తామని చెప్పారు. అభ్యర్థులు ఎవరూ దళారుల మాటలు నమ్మొద్దు, మోసపోవద్దన్నారు.

Canada: కెనడాలో 10లక్షలకు పైగా ఉద్యోగాలు

రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో గ్రూప్‌-1 పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్‌లో ఉండి కెమెరాలను టీఎస్‌పీఎస్సీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందన్నారు. ప్రశ్నాపత్రాలను ప్రత్యేక నిఘాలో ఉంచేలా ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌, టీఎస్‌పీఎస్సీ అధికారి సమక్షంలో ప్రశ్నాపత్రం ఓపెన్‌ చేస్తామని.. దీన్ని మొత్తం వీడియో తీస్తామని చెప్పారు. పరీక్ష ముగిసిన తర్వాత ఓఎంఆర్‌ షీట్‌ను సీల్‌ చేసేటప్పుడు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ప్రతికేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని టీఎస్‌ఆర్టీసీకి సూచించామని తెలిపారు.

హైదరాబాద్‌ సహా నగరాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని పేర్కొన్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ నిర్వహిస్తామని తెలిపారు. 10.15 నిమిషాల వరకే పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తామని చెప్పారు. గ్రూప్స్‌ వంటి పరీక్ష రాసే అభ్యర్థులకు సమయపాలన ఎంతో అవసరమని తెలిపారు. తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని.. ఒక్కొక్కరి బయోమెట్రిక్‌కు సుమారు 15 సెకన్ల సమయం పడుతుందన్నారు. అభ్యర్థులు ఉదయం 8.30 గంటలలోపే పరీక్ష కేంద్రానికి రావాలన్నారు. అలా రావడం వల్ల.. టెన్షన్‌ పడకుండా ప్రశాంతంగా పరీక్ష రాయొచ్చని తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.