Vidyadhan Scholarships : పది, ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రూ.75 వేలు ఇస్తారు.. వెంటనే ఇలా చేయండి
Vidyadhan Scholarships : పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు, ఇంటర్ చదువుతున్న వారికి శుభవార్త. రూ.75 వేల వరకు పొందవచ్చు.
- Dharani Pilli
- Updated on- May 11, 2026 / 01:24 PM IST
Sarojini Damodaran Foundation inviting applications for the Vidyadhan scholarships June 20 as the last date to apply
Vidyadhan Scholarships : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు శుభవార్త. మీరు సంవత్సరానికి రూ. 75 వేల వరకు పొందవచ్చు. ఇంతకూ ఈ మొత్తం ఎవరు ఇస్తున్నారు.. ఎందుకు ఇస్తున్నారు అంటే.. ఇది ఒక స్కాలర్‌షిప్ కార్యక్రమం. సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ప్రతిభ గల పేద విద్యార్థులను ఆదుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా ‘విద్యాదాన్’ ఉపకార వేతనాల పేరిట ప్రతి సంవత్సరం పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు రూ. 10 వేల నుంచి రూ. 75 వేల వరకు ఉపకార వేతనం ఇస్తారు.
ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది సరోజినీ దామోదరన్ ఫౌండేషన్. పది, ఇంటర్ ఫలితాల్లో పాస్ అయిన విద్యార్థులు ఈ ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి జూన్ 20 చివరి గడువుగా ప్రకటించింది. దీనికి దరఖాస్తు చేస్తున్న విద్యార్థులకు.. జూలై 5న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థి పది, ఇంటర్ లో చూపిన ప్రతిభ, దరఖాస్తులో ఇచ్చిన సమాచారం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి ఆన్‌లైన్ పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్ష వివరాలను ఈ-మెయిల్ ద్వారా విద్యార్థులకు తెలియజేస్తారు.
అర్హతలు:
-
ఈ ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని భావించే విద్యార్థి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 2 లక్షల లోపు ఉండాలి.
-
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పదో తరగతిలో కనీసం 90 శాతం మార్కులు సాధించి ఉండాలి. ప్రస్తుతం ఇంటర్మీడియట్, డిప్లొమా చదువుతున్న వారు అర్హులు.
-
ఎంపికైన విద్యార్థులకు రెండేళ్ల పాటు ఉపకార వేతనాలు అందిస్తారు.
-
కోర్సు, కాలపరిమితి ఆధారంగా ఏడాదికి రూ. 10 వేల నుంచి రూ. 75 వేల వరకు ఉపకార వేతనాలు ఇస్తారు.
మరిన్ని వివరాల కోసం విద్యార్థులు vidyadhan.andhra@sdfoundationindia.com అనే సైట్‌లో లేదా 96635 17131 నంబరుకి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు కాల్ చేసి అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఫౌండేషన్ పేర్కొంది.
