BJP vs local parties in by polls
Bypolls: దేశంలోని ఆరు రాష్ట్రల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోని మునుగోడు, మహారాష్ట్రలోని తూర్పు అంధేరి, హర్యానాలోని అదాంపూర్, ఉత్తరప్రదేశ్లోని గోలా గోరఖ్నాథ్, బిహార్లోని గోపాల్ గంజ్ & మొకమ, ఒడిశాలొని ధాంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా ప్రకటించింది. అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు అన్నట్లుగా పోటీ కొనసాగింది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రాంతీయ పార్టీలు గట్టి పోటీని ఇచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలదే పైచేయి అని ప్రస్తుతం విడుదలవుతున్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.
తెలంగాణలోని మునుగోడులో అధికార పార్టీ టీఆర్ఎస్దే గెలుపని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ ఎన్నికలో ఓటమి తప్పదనే అంటున్నారు. ఇక ముంబైలోని తూర్పు అంధేరి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించి ఉపసంహరించుకుంది. అయితే బీజేపీ అభ్యర్థి పోటీ చేసినప్పటికీ ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనదే గెలుపని ముందు నుంచి ప్రచారం సాగుతోంది.
ఇక ఉత్తరప్రదేశ్లోని గోలా గోరఖ్నాథ్ నియోజకవర్గంలో బీజేపీ, ఎస్పీ మధ్య పోటాపోటీ కొనసాగింది. వాస్తవానికి ఈ స్థానంలో బీజేపీదే ఆధిపత్యం ఉన్నప్పటికీ.. పోటీ నుంచి బీఎస్పీ, కాంగ్రెస్ తప్పుకోవడంతో ఆ రెండు పార్టీల ఓట్ బ్యాంక్ ఎస్పీవైపే మళ్లే అవకాశం ఉంది. దీంతో బీజేపీ, ఎస్పీల మధ్య గట్టి ఫైట్ నడిచింది. బిహార్లోని గోపాల్ గంజ్ & మొకమ నియోజకవర్గాల్లో ఆర్జేడీ ఆధిపత్యం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గోపాల్ గంజ్ నియోజకవర్గంలో ఆర్జేడీ, బీజేపీ మధ్య హోరాహోరి ఉన్నట్లు సమాచారం.
హర్యానాలోని అదాంపూర్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. నేడు జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉన్న ఏకైక నియోజకవర్గం ఇదే. అయితే ఇక్కడ బీజేపీ గెలవనున్నట్లు అంచనాలు వచ్చాయి. చివరిగా ఒడిశాలోని ధాంనగర్ నియోజకవర్గంలో స్థానిక అధికార పార్టీ బిజూ జనతా దళే జెండా ఎగుర వేస్తుందని అంటున్నారు. అయితే బీజేపీ వీలైనన్ని ఎక్కువ ఓట్లు సంపాదిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
Bypolls: ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కారుదే పైచేయి