Assembly Elections 2023: బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కాగానే రాష్ట్ర అధ్యక్షుడి ఇంటిపై రాళ్ల దాడి

దీనిపై శనివారం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఇది ఆదివారం మరింత తీవ్రమైంది. మీడియా కథనాల ప్రకారం.. మన్పురా కూడలిలో కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు

Assembly Elections 2023: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తొలి జాబితా మాదిరిగానే రెండో జాబితాపై కూడా వ్యతిరేకత పెరిగింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాలైన చిత్తోర్‌గఢ్, అల్వార్, జైపూర్, రాజ్‌సమంద్, ఉదయ్‌పూర్, బుండిలలో కాషాయ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి సొంత జిల్లాలైన చిత్తోర్‌గఢ్‌, రాజ్‌సమంద్‌లలో నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఆదివారం సీపీ జోషి ఇంటిపై రాళ్ల దాడి జరగగా, రాజ్‌సమంద్‌లోని బీజేపీ కార్యాలయం ధ్వంసమైంది. ఆగ్రహించిన కార్యకర్తలు కార్యాలయంలో ఉంచిన కుర్చీలను పగలగొట్టి, ఎన్నికల సామగ్రిని కూడా చించివేశారు.

ఎమ్మెల్యే చంద్రభాన్‌సింగ్‌ అక్యాకు టికెట్‌ దక్కకపోవడంతో కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. దీనిపై శనివారం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఇది ఆదివారం మరింత తీవ్రమైంది. మీడియా కథనాల ప్రకారం.. మన్పురా కూడలిలో కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు. నిరసనల దృష్ట్యా జోషి ఇంటి వద్ద శనివారం నుంచే భద్రతను పెంచారు. టిక్కెట్ల రద్దుపై ఆగ్రహించిన కార్యకర్తలు చంద్రభాన్ సింగ్ అక్యాను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Uttar Pradesh: అజాం‭కు ఎన్‭కౌంటర్ భయం.. పోలీసు వాహనంలో కూర్చునేందుకు భయపడి తండ్రిని, సోదరుడిని పట్టుకుని ఏడ్చాడు

రాజసమంద్‌, జైపూర్, బుండి, ఉదయ్‌పూర్, అల్వార్ లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. పార్టీ కార్యాలయాల్లోకి వెళ్లి మరీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ముఖ్యుల దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. తమ నాయకులకు టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొదటి జాబితా విడుదల చేసినప్పుడు దాదాపు ఇదే వాతావరణం కనిపించింది. ఇక రెండో జాబితాలోనూ ఇదే రిపీట్ అవుతోంది. దీంతో కమల నేతల్లో ఆందోళన పెరిగింది. మరో నెల రోజుల్లో పోలింగ్ ఉందనగా.. ఈ పరిణామాలు ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.