Election Commission On Why It Did Not Announce Gujarat Poll Dates Now
EC: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ విషయమై శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను మాత్రం ప్రకటించలేదు. వాస్తవానికి ఏక కాలంలో రెండు అంతకు మించి అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం.. అన్నింటికి ఒకే రకమైన తేదీలను ప్రకటించడం కొత్తేమీ కాదు. ప్రతి ఏడాది దేశంలో నాలుగు నుంచి అంతకు మించి అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుంటాయి. అయితే వీటన్నిటికీ ఒకే షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలు నిర్వహించడం చాలా కాలంగా వస్తున్న పద్దతే.
ఇకపోతే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి ఎన్నికల సంఘం సానుకూలంగా వ్యవహరిస్తోందని, అందుకే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించలేదని ఆరోపిస్తున్నారు. ఈ ప్రశ్న మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమారే స్వయంగా ఎదుర్కొన్నారు. అయితే ఈ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ‘‘రెండు అసెంబ్లీలకు వేరు వేరు ఎన్నికల తేదీలు ప్రకటించినంత మాత్రాన ఎన్నికల నియమావళిని అతిక్రమించినట్టు కాదు’’ అని సమాధానం ఇచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘రెండు అసెంబ్లీలు ఒకే గడువులో ముగిసిపోవడం లేదు. రెండింటికీ మధ్య 40 రోజుల వ్యత్యాసం ఉంది. గుజరాత్ అసెంబ్లీ ఫిబ్రవరి 18తో ముగిస్తే, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ జనవరి 8తోనే ముగుస్తుంది. రెండు అసెంబ్లీ ఎన్నికలకు 30 రోజుల వ్యత్యాసం ఉన్నంత మాత్రాన ఒక రాష్ట్రంలోని ఫలితాలు మరో రాష్ట్రంపై ప్రభావం చూపవు. పైగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి కాస్త తొందరగా ఎన్నికల తేదీలు ప్రకటించడానికి మరో కారణం కూడా ఉంది. రాబోయే రోజుల్లో అక్కడ మంచు పెరగబోతోంది. అది కాస్త ఇబ్బందిగా మారుతుంది. దానికి ముందే ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది’’ అని రాజీవ్ కుమార్ అన్నారు.