Assembly Elections 2023: భర్తకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది.. పురుషాధిక్యత అంటూ కాంగ్రెస్‭పై విరుచుకుపడ్డ భార్య

మన సమాజం పురుషాధిక్యత కలిగింది. మహిళలు ముందుకు వస్తే 100 శాతం సహించదు. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించడం గురించి మాటలు చెప్పడం చాలా సులభం, కానీ చేతలే చాలా కష్టం

Rajasthan Politics: మామూలుగా కుటుంబంలో ఎవరికైన ఎన్నికల్లో పోటీకి టికెట్ వస్తే.. కుటుంబమంతా కలిసి ఎగిరి గంతేస్తుంది. కానీ రాజస్థాన్ కు చెందిన ఒక మహిళ మాత్రం తన భర్తకు టికెట్ వచ్చినప్పటికీ.. పురుషాధిక్య సమాజం అంటూ భర్తకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కారణం లేకపోలేదు. అంతకు ముందు ఆ టికెట్ ఆమెకు ఇచ్చారు. ఆమె టికెట్ కట్ చేసి భర్తకు ఇవ్వడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ 76 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. తొలి జాబితాలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార సహా 33 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే రెండో జాబితాలో 15 మంది మంత్రులతో సహా 43 మంది పేర్లను ప్రకటించారు. రెండో జాబితాలో అల్వార్ జిల్లా రామ్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే సఫియా జుబేర్ ఖాన్ కు మొదట ఇచ్చినప్పటికీ తర్వాత ఆ టికెట్‌ను కాంగ్రెస్ రద్దు చేసింది. సఫియా స్థానంలో ఆమె భర్త, మేవాత్ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్ జుబేర్ ఖాన్‌ను అభ్యర్థిగా నియమించారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంపై సఫియా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో అభ్యర్థుల్ని మార్చనున్న కాంగ్రెస్, బీజేపీ!

ఒక మీడియా సంస్థకు సఫియా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నా టికెట్ కట్ చేయడం పార్టీ తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయం. మన సమాజం పురుషాధిక్యత కలిగింది. మహిళలు ముందుకు వస్తే 100 శాతం సహించదు. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించడం గురించి మాటలు చెప్పడం చాలా సులభం, కానీ చేతలే చాలా కష్టం. మహిళలు పంచాయతీరాజ్‌లోకి వస్తే పని చేయలేకపోతున్నారు. ఏం చేయాలనుకున్నా చేయనివ్వడం లేదు. పురుషాధిక్య సమాజం ఆలోచనా ధోరణి మారడానికి సమయం పడుతుంది. కానీ ఈ మార్పు రాబోయే కాలంలో ఖచ్చితంగా వస్తుంది’’ అని అన్నారు.

రామ్‌గఢ్ స్థానం నుంచి జుబేర్ ఖాన్ 6 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2008, 2013 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయన భార్య సఫియా జుబేర్ ఖాన్‌కు టికెట్ ఇచ్చింది. సఫియా 12 వేలకు పైగా ఓట్లతో బీజేపీకి చెందిన సుఖ్వంత్ సింగ్‌పై విజయం సాధించారు. కాంగ్రెస్ రెండు జాబితాల్లో ఆరుగురు ముస్లిం అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సవాయ్ మాధోపూర్ నుంచి డానిష్ అబ్రార్, ఫతేపూర్ నుంచి హకమ్ అలీ, కిషన్‌పోల్ నుంచి అమీన్ కాగ్జీ, ఆదర్శ్ నగర్ నుంచి రఫీక్ ఖాన్, పుష్కర్ నుంచి నసీమ్ అక్తర్ ఇన్సాఫ్, రామ్‌గఢ్ నుంచి జుబేర్ ఖాన్‌లకు టిక్కెట్లు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Israel Palestine Conflict: పేదరికం, ఆకలితో గాజా స్ట్రిప్ ప్రజల తిప్పలు.. విదేశాల్లో విలాసవంతమైన జీవితంలో హమాస్ ఉగ్రవాదులు