తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న ఆయన.. ఈ నెల 26న (ఆదివారం) హైదరాబాద్ రానున్నారు. అదే రోజున కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమక్ కుమార్ కి మద్దతుగా నిర్వహించే ర్యాలీలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ఈ విషయమై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ శనివారం (నవంబర్ 18) తెలిపారు. శనివారం జనసేన ఐటీ మిత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
ఏపీ రాజకీయాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టిన జనసేనాని తెలంగాణలో కూడా పోటీకి సిద్ధం కావటం.. బీజేపీతో పొత్తు.. తమకు కేటాయించే సీట్ల గురించి చర్చ ఇదంతా రసవత్తరంగా మారింది. జనసేన మొదట్లో 20కి పైగా సీట్లు అడిగింది. కానీ బీజేపీ కేవలం 8 మాత్రమే కేటాయించింది. సాధారణంగా జనసేన ఏపీ మీదే ఫుల్ ఫోకస్ పెట్టింది. కానీ తెలంగాణలో కూడా పోటీకి దిగటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జనసేన తమకు కేటాయించిన నియోజకవర్గాలకు అభ్యర్ధులను కూడా ప్రకటించింది. వారి తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చూస్తే.. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బీసీ ఆత్మగౌరవ సభలో తప్ప జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ కనపించలేదు. తమ అభ్యర్థుల తరపున ప్రచారం ఇప్పటి వరకు ఎక్కడ చేయలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు కూకట్ పల్లి సభ గురించి ప్రకటన వచ్చింది. అయితే రాష్ట్రంలో ఎన్ని సభలు నిర్వహిస్తారు? ఎన్ని రోజులు ప్రచారం చేస్తారనే విషయమై ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు.