Telangana Assembly Elections 2023: కాంగ్రెస్‭లో మొగొల్లు లేరా? మిర్యాలగూడలో కేసీఆర్.. ప్రజలపై వరాల జల్లు

దళితులు, గిరిజనులు అనాదిగా వివక్షతకు గురవుతునే ఉన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి మంచి చెడులు విచారించి ఓటు వేయాలి. ఎన్నికల్లో ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం గెలుపు.

Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే హీటుగా ఉన్న రాజకీయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తన వరుస పర్యటనలతో మరింత హీటెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సూర్యపేట జిల్లా హుజూర్ నగర్, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. పెన్షన్ 5 వేల రూపాయలు చేస్తామని, 400 రూపాయలకే వంట గ్యాస్ ఇస్తామని, అలాగే ఇప్పటికే ఇస్తున్న రైతు బంధును 16 వేల రూపాయలకు పెంచుతామని అన్నారు. ప్రజలకు హామీలు ఇస్తూనే విపక్షాలపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కేసీఆర్ ప్రసంగంలోని హైలైట్స్
*కాంగ్రెస్ నాయకులకు మంత్రి పదవులు, కాంట్రాక్ట్ లు ముఖ్యం. ప్రజా సమస్యలు పట్టవు. నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిండు అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అన్నప్పుడు కాంగ్రెస్ లో మొగొళ్లు లేరా! ఆరోజు నోరు ఎందుకు మెదపలేదు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి విషయంలో అడ్డు తగులుతూనే ఉంది.
*2003లోనే నాగార్జున సాగర్ కట్ట మీదనే నాటి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన. నాగార్జున సాగర్ డ్యాం కట్టవలసిన స్థలం కాదు. ఇప్పుడు కట్టిన ప్రదేశానికి 20కి.మీ వెనకకి కట్టాల్సిన ప్రాజెక్ట్. పంటలు ఎండి పోకుండా నాగార్జున సాగర్ కి ఎడమ కావలవకు నీళ్ళు వదులుతాం.
*రైతు బంధు అనే పదాన్ని ఈ ప్రపంచంలోనే సృష్టించింది కేసీఆర్. ఈ రైతు బంధు పథకాన్ని చూసి ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలు, ఎంఎస్ స్వామినాథన్ లాంటి వ్యవసాయవేత్తలు నన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రైతు బంధు ఇవ్వడం ఇష్టం లేదంట. కేసీఆర్ కల నిజం చేసినటువంటి మొనగాళ్లు తెలంగాణ ప్రజలు. వ్యవసాయంలో దేశంలో పంజాబ్ తరువాత తెలంగాణనే అగ్రగామిగా ఉంది.
*కాంగ్రెసోళ్లు 3గంటల విద్యుత్తు చాలని అంటున్నారు. స్వరాష్ట్ర సాధన తర్వాతే కరెంట్ కష్టాలు తొలిగాయి. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంట్ కష్టాలు, సాగు,తాగు నీటి కష్టాలు అనేకం. వ్యవసాయంలో దేశంలో పంజాబ్ తరువాత తెలంగాణనే అగ్రగామిగా ఉంది.
*రాహుల్ గాంధీ ధరణి రద్దు చేస్తాడట. ధరణి ఉంది కాబట్టే మీ రికార్డ్ ప్రభుత్వం దగ్గర ఉంది. రైతు బంధు రైతు భీమా వంటి నగదు డైరెక్ట్ గా రైతు అకౌంట్లో పడుతుంది.
*దళితులు, గిరిజనులు అనాదిగా వివక్షతకు గురవుతునే ఉన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి మంచి చెడులు విచారించి ఓటు వేయాలి. ఎన్నికల్లో ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం గెలుపు. పార్టీల చరిత్ర వైఖరి సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకోవాలి. యువత ఆలోచించి ఓటు వేయాలి..దానిని దుర్వినియోగం చేయవద్దు.
*పెన్షన్ రూ.5వేలు చేస్తాం, రైతు బంధు రూ.16వేల అందజేస్తాం, రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం, దేశంలోనే లేనన్ని సంక్షేమ పథకాలు మన తెలంగాణలో ఉన్నాయి.