Priyank Kharge
Karnataka Polls: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘విషనాగు’ అంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించాయి. అయితే ఇరు పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు వాతావరణం కొంత చల్లబడిందో లేదో, ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే మరోసారి వేడెక్కించారు. ప్రధాని మోదీనే లక్ష్యం చేసుకుని ‘నాలాయక్ బేటా’ (పనికిమాలిన కొడుకు) అంటూ వ్యాఖ్యానించారు. కలబురిగి జిల్లా పర్యటనలో భాగంగా బంజారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రియాంక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ ఆదివారం కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బంజారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బంజారా ప్రజల కుమారుడిగా తాను ఢిల్లీలో ఉన్నానని, అందరి బాగోగులు చూస్తానని చెప్పారు. అనంతరం మోదీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ప్రియాంక్ ఖర్గే ఆదివారం మాట్లాడుతూ ప్రధాని తనను తాను బంజారాల కుమారుడంటూనే బంజారాలను మోసం చేశారని, రిజర్వేషన్ల విషయంలో బంజారాలను అయోమయంలో పడేశారని చెప్పారు. మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యల రగడ కొనసాగుతుండగానే ఆయన తనయుడు ప్రియాంక్ ఖర్గే కూడా ప్రధానిపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.