Madhya Pradesh Politics: ప్రభుత్వాల పనితీరు వివరించే క్రమంలో కొన్ని ఉదాహరణలు చెప్పడం మామూలే. అలాంటి ఒక ఉదహారాణల్లో నటి, ఎంపీ హేమామాలినిని ప్రస్తావిస్తూ చెప్పడం ఉత్తర భారత రాజకీయాల్లో పరిపాటి అయింది. అప్పుడెప్పుడో లాలూ ప్రసాద్ యాదవ్ మొదటిసారిగా.. బిహార్ రోడ్లను తాము హేమామాలిని బుగ్గలలాగ తయారు చేశామని అన్నారు. ఇక అంతే.. రోడ్ల గురించి వచ్చినప్పుడు తరుచూ హేమామాలిని పేరు వినిపిస్తూనే ఉంది. తాజాగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా ఉన్నాయని అంటున్నారు.
నరోత్తమ్ మిశ్రా ఏమన్నారు?
మధ్యప్రదేశ్ లోని దాటియా నియోజకవర్గంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తన విజయాలను చెప్పుకుంటూ ఎంపీ హేమమాలినిని ప్రస్తావించారు. దాతియాలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేశామని, ఎంతలా అంటే హేమమాలినిని డ్యాన్స్ చేసేలా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక దీనిపై వివాదం చెలరేగింది. మహిళల పట్ల బీజేపీ నేతల ప్రవర్తన ఇది అంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. బీజేపీలో మహిళల పరిస్థితి ఇదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.