Himachal Assembly Polls: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రియాంక గాంధీ

Himachal Assembly Polls: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రారంభించారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‭లోని సోలన్ చేరుకున్న ఆమె.. అక్కడి తోడో మైదానంలో ఏర్పాటు చేసిన పరివర్తన్ ప్రతిజ్ణ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేశారు. ఇక రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకుంటామని ప్రియాంక అన్నారు.

ఇక కేంద్రంలో రాష్ట్రంలో (హిమాచల్ ప్రదేశ్) అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మతాలు, కులాల పేరు చెప్పుకుంటూ అభివృద్ధిని, ప్రజల అవసరాల్ని బీజేపీ పక్కన పడేసిందని విమర్శించారు. దేశంలో అత్యంత ఎగువకు నిరుద్యోగ స్థాయి పెరిగిందని, ద్రవ్యోల్బణం పరిస్థితి కూడా అలాంటిదేనని అన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని ప్రియాంక అన్నారు.

ఈ ర్యాలీలో పాల్గొనడానికి ముందు ఆమె సోలన్‭లోని మా శూలిని మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీకి ఎన్నికల థీమ్ పాటను విడుదల చేశారు. ఇక ప్రియాంక గాంధీ ఎన్నికల ర్యాలీకి ఒక్కరోజు ముందే అంటే గురువారం రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. అంతే కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఉనా, చంబాలో నిర్వహించిన రెండు బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

EC: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించకపోవడానికి గల కారణాలు వెల్లడించిన ఈసీ

ట్రెండింగ్ వార్తలు