Assembly Elections 2023: రాహుల్ గాంధీ సాక్షిగా చేతులు కలిపిన బద్ధశత్రువులు.. ఇక కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనట్టేనా?

వారు వేరుగా లేరు, ఒకటిగానే ఉన్నారు, ఒకటిగానే ఉన్నారు. కలిసే ఎన్నికలకు వెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కలిసే కాంగ్రెస్ పార్టీని ఘనమైన మెజారిటీతో గెలుస్తారు. క్లీన్ స్వీప్ చేస్తారు

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలంగానే ఉన్నప్పటికీ.. ఆ పార్టీలోని ఇద్దరు ప్రధాన నేతల మధ్య వైరం ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే ఎన్నికలు సమీపించినప్పటికీ ఇరు నేతల మధ్య సయోధ్య కుదరలేదు. వీరిని కలిపేందుకు అధిష్టానం పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. ఎన్నికల వేళ కూడా ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉండడం గమనార్హం.


అయితే తాజాగా ఉన్నట్టుండి ఇరు నేతలు ఒక చోట కనిపించారు. అది కూడా రాహుల్ గాంధీ సమక్షంలో ఒక్కటిగా కనిపించడం ఆసక్తికరం. దీంతో ఇరు నేతల మధ్య రాజీ కుదరించిందని, ఇక కాంగ్రెస్ పార్టీ సెట్టైనట్టేనని ఆ పార్టీ కార్యకర్తలు ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ సమయంలో ఇరు నేతలు మాట్లాడుకోవడం మాత్రం కనిపించలేదు. రాజస్థాన్ కు వచ్చిన రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి జైపూర్ ఎయిర్ పోర్టుకు ఇద్దరు నేతలు వచ్చారు. ఈ సందర్భంలోనే వీరి కలయిక ఆసక్తిని రేపింది.


ఇక ఈ కలయికపై రాహుల్ గాంధీ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘వారు వేరుగా లేరు, ఒకటిగానే ఉన్నారు, ఒకటిగానే ఉన్నారు. కలిసే ఎన్నికలకు వెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కలిసే కాంగ్రెస్ పార్టీని ఘనమైన మెజారిటీతో గెలుస్తారు. క్లీన్ స్వీప్ చేస్తారు’’ అని అన్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తిప్పికొట్టింది. కేవలం ఫొటో షూట్ కోసమే ఈ స్టంట్ వేశారని, వాస్తవానికి గెహ్లాట్, పైలట్ మధ్య వైరం అలాగే ఉందని విమర్శిస్తున్నారు.