EVM Strong Room: మిజోరాంలోని 40 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో 20 అసెంబ్లీ స్థానాలకు తొలి దశ ఓటింగ్ మంగళవారం జరిగింది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత మొత్తం 5 రాష్ట్రాల ఓట్లను డిసెంబర్ 3న లెక్కించనున్నారు. అప్పటి వరకు ఓట్లు వేసిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తారు. అయితే చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే.. ఈ స్ట్రాంగ్ రూమ్ అంటే ఏమిటి? ఈవీఎంలను ఎలా తీసుకెళతారు? వాటిని అక్కడ ఎలా భద్రంగా ఉంచుతారు? అని.
వాస్తవానికి, ఓటింగ్ ప్రక్రియ పూర్తైన వెంటనే ఈవీఎంలను వెంటనే పోలింగ్ బూత్ నుంచి స్ట్రాంగ్ రూమ్‌కు పంపరు. ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్‌కు పంపే ముందు ప్రిసైడింగ్ అధికారి.. ఈవీఎంలోని ఓట్ల రికార్డును పరీక్షిస్తారు. దీని తర్వాత అందరు అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్‌లకు సర్టిఫైడ్ కాపీ ఇస్తారు. ఆ తర్వాతనే ఈవీఎంను సీలు చేస్తారు. అనంతరం పోలింగ్ ఏజెంట్లు సంతకాలు చేస్తారు. సంతకం చేసిన అనంతరం, అభ్యర్థులు లేదంటే వారి ప్రతినిధులు ఈవీఎంతో పాటు పోలింగ్ స్టేషన్ నుంచి స్ట్రాంగ్ రూమ్‌కు వెళతారు. ఈవీఎంలన్నీ స్ట్రాంగ్‌రూమ్‌లోకి వచ్చిన తర్వాత సీల్ చేస్తారు.
ఈవీఎంలను భద్రపరిచే చోటే స్ట్రాంగ్ రూమ్
స్ట్రాంగ్ రూమ్ అంటే పోలింగ్ బూత్ నుంచి తీసుకొచ్చిన ఈవీఎంలను భద్రపరిచే గది. ఎన్నికల సంఘం స్ట్రాంగ్‌రూమ్‌కు మూడు స్థాయిల్లో రక్షణ కల్పిస్తుంది. స్ట్రాంగ్ రూం లోపల కేంద్ర పారామిలటరీ బలగాలు భద్రతను నిర్వహిస్తాయి. ఇక లోపలే రెండో అంచె భద్రత ఉంటుంది. ఇక్కడ కూడా సెంట్రల్ ఫోర్స్ సిబ్బంది ఉంటారు. ఇక మూడు అంచె బయటి భద్రతకు సంబంధించింది. ఇక రాష్ట్ర పోలీసు బలగాలకు చెందినవారు ఉంటారు.
స్ట్రాంగ్ రూం తెరవవచ్చా?
స్ట్రాంగ్‌రూమ్‌ను సీల్ చేసిన తర్వాత, కౌంటింగ్ రోజు ఉదయం మాత్రమే తెరుస్తారు. ప్రత్యేక పరిస్థితులు లేదా అత్యవసర పరిస్థితుల్లో, స్ట్రాంగ్ రూమ్ తెరుస్తారు. అయితే అభ్యర్థులు ఎదుటే అది తెరుస్తారు. వారు లేకుండా తెరవరు. ఎన్నికలకు ముందు జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో) పర్యవేక్షణలో ఈవీఎంలను గోదాములో ఉంచుతారు. ఈ గోదాము భద్రత కోసం ఎల్లప్పుడూ కేంద్ర బలగాలను మోహరిస్తారు. అంతే కాకుండా సీసీటీవీల ద్వారా కూడా నిఘా ఉంచుతారు. ఎన్నికల సంఘం అధిపతి ఆదేశం లేకుండా ఎన్నికల ముందు ఈవీఎంలను బయటకు తీసుకురావడానికి వీల్లేదు.