Assembly Eelections 2023: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? అంచనాలను తలకిందులు చేసిన సర్వే

ఈ సర్వేలో పది శాతం మంది ప్రజలు కేంద్ర మంత్రి (జోధ్‌పూర్ ఎంపీ) గజేంద్ర సింగ్ షెకావత్‌ను ముఖ్యమంత్రికి తమ మొదటి ఎంపికగా ప్రకటించారు. కాగా, ఏడు శాతం మంది ప్రజలు రాజ్యవర్ధన్ రాథోడ్‌ను సీఎంగా ఎంపిక చేశారు.

Rajasthan Assembly Polls: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ గెలుపుపై ​​అన్ని రాజకీయ పార్టీలు తమ వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా రాజస్థాన్ ప్రజల మొదటి ఎంపిక ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌లు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి పదవికి పోటీదారులుగా ఉన్నారు. అయితే ఈసారి బీజేపీ నుంచి అభ్యర్థులు ఎవరంటే చెప్పడం కష్టంగా ఉంది. అయితే, వసుంధర రాజే మద్దతుదారులు ఆమెను ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారుగా భావిస్తున్నారు.

సీఎం పదవికి మొదటి ఎంపిక ఎవరు?
ఇదిలా ఉంటే, దీనికి సంబంధించి ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వే నిర్వహించగా ఈసారి ముఖ్యమంత్రి పదవిపై ప్రజలు అంచనాలను తలకిందులు చేసే ఫలితాలు ఇచ్చారు. సర్వే ప్రకారం.. ముఖ్యమంత్రిగా ప్రజల మొదటి ఛాయిస్ ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాటే అని తేలింది. 34 శాతం మంది ప్రజలు ఆయనే ముఖ్యమంత్రికి మొదటి ఛాయిస్ అని చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి పదవికి వసుంధర రాజేను మొదటి ఎంపికగా 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక సొంత పార్టీ నుంచే గట్టి పోటీ ఇస్తున్న సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా 18 శాతం మంది ప్రజలు మొదటి ఎంపికలో తీసుకున్నారు. వాస్తవానికి గెహ్లోట్ కంటే పైలట్ వైపు ఎక్కువ ప్రభావం ఉందని విశ్లేషణలు వచ్చినప్పటికీ.. సర్వేలో పైలట్ కంటే డబుల్ మేజారిటీతో అలాగే ప్రత్యర్థి పార్టీ అయిన వసుంధరతో పోల్చినా 12 శాతం ఎక్కువ మద్దతు సంపాదించడం గమనార్హం.

గజేంద్ర సింగ్, రాజ్యవర్ధన్ సింగ్ కూడా ఉన్నారు
ఇది కాకుండా, ఈ సర్వేలో పది శాతం మంది ప్రజలు కేంద్ర మంత్రి (జోధ్‌పూర్ ఎంపీ) గజేంద్ర సింగ్ షెకావత్‌ను ముఖ్యమంత్రికి తమ మొదటి ఎంపికగా ప్రకటించారు. కాగా, ఏడు శాతం మంది ప్రజలు రాజ్యవర్ధన్ రాథోడ్‌ను సీఎంగా ఎంపిక చేశారు. వీరే కాకుండా మిగిలిన నేతలు తొమ్మిది శాతం మద్దతు సంపాదించుకున్నారు.

సర్వే ఫలితాలు
అశోక్ గెహ్లాట్-34%
వసుంధర రాజే -22%
సచిన్ పైలట్-18%
గజేంద్ర షెకావత్-10%
రాజ్యవర్ధన్ రాథోడ్-7%
ఇతరులు – 9%