10TV Beyond Borders Coffee Table Book event
10TV Beyond Borders: 10TV బియాండ్ బోర్డర్స్ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వదేశీ ఆయుధాల తయారీలో భాగస్వాములుగా ఎనలేని సేవలందిస్తున్న ప్రతిష్ఠాత్మక సంస్థలకు సగర్వంగా అవార్డులను ప్రదానం చేసింది 10టీవీ.
సరిహద్దుల్లో, రక్తం గడ్డకట్టే చలిలో.. మంచు పర్వతాల అంచులపై..ఒళ్లంతా కళ్లు చేసుకుని పహారా కాస్తాడు భారత వీర జవాన్. మనకెన్నో రంగులు, హంగులు, పండుగలు, పర్వదినాలు. ఆ యోధుడికి తెలిసింది మూడే రంగులు.. 365 రోజులు పరాక్రమ పోరాటాలు. బోర్డర్‌లో నిత్యం ప్రాణాలకు తెగించి పోరాడే యుద్ధవీరుడి ఊపిరే.. నిత్య నూతనంగా తలెత్తుకుని గర్వంతో ఎగిరే త్రివర్ణ పతాకపు రెపరెపలు . ఆ వీరసైనికుడి చేతికి ఆయుధం ఆరో వేలు. అహర్నిశలు తోడుండే నేస్తం. ఆ ఆయుధమే సరిహద్దులకు ఇవతల దేశానికి భరోసానిచ్చే ధైర్యం, స్థైర్యం.
ఒకరి సాయం కోరే స్థితి నుంచి భరోసా నింపే స్థాయికి.. ఆధారపడే పరిస్థితి నుంచి .. ఆధిపత్యం ప్రదర్శించే ఔన్నత్యానికి మనం ఎదిగాం.. రక్షణ రంగం, అంతరిక్ష పరిశోధనా రంగాల్లో దశాబ్దకాలంగా సాధించిన అమేయమైన, అద్భుత ఆయుధ ప్రగతే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు ఆయుధ, సాంకేతిక సాయం కోసం ఇతర దేశాలవైపు చూసిన మనం ఇప్పుడు అగ్ర దేశాలతో పోటీ పడుతున్నాం.. శక్తిమంతమైన రక్షణ వ్యవస్థ కలిగిన దేశంగా ఎదుగుతున్నాం. విధాన సంస్కరణలు, స్వదేశీ ఆవిష్కరణలు, భవిష్యత్ దార్శనికతతో మన రక్షణరంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పు ఇది.
మేక్ ఇన్ ఇండియా.. ఇది భారత్‌ను గ్లోబల్ గేమ్ ఛేంజర్‌గా మార్చిన నినాదం. విదేశీ దిగుమతులకు గుడ్‌బై చెప్పి.. స్వదేశీ ఆవిష్కరణలతో మార్మోగుతున్న విప్లవ ఢంకా. దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం. డిజైన్ నుంచి డెవలప్‌మెంట్, ఉత్పత్తి వరకు.. ప్రతి దశలో మనదైన దేశీయ ముద్ర కనబడుతోంది.
DRDO ప్రయోగశాల నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మిధాని, ఈసీఐఎల్, భారత్ డైనమిక్స్‌లాంటి సంస్థలు ఆత్యాధునిక ఆయుధాల ఆవిష్కరణలతో జోష్ నింపుతున్నాయి. iDEX, TDF లాంటి పోటాపోటీ పథకాలతో తిరుగులేని ఆవిష్కరణలకు ఊతం దొరికింది. చీల్చి చెండాడే, వీర విజృంభణ చేసే, శత్రువుల గుండెల్ని గుభేల్ మనిపించే అత్యాధునిక ఆయుధాల ఆవిష్కరణలు జోరందుకున్నాయ్.
నింగి, నేల, నీరు.. ప్రాంతమేదైనా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, నేవీ కదం తొక్కుతున్నాయ్. తేలికైన యుద్ధ విమానాల నుంచి.. టన్నుల బరువును మోసుకెళ్లే స్టెల్త్ ఫైటర్ జెట్ల దాకా.. డ్రోన్లు, బ్రహ్మోస్ మిస్సైళ్లు .. ఇలా అన్నీ మనమే తయారు చేసుకుంటున్నాం.. మన యుద్ధ అవసరాలకే కాదు.. ప్రపంచ ఆయుధ మార్కెట్‌ను శాసించే స్థాయిలో మన ఎదుగుదలకు ఇది నిలువెత్తు సాక్ష్యం.
ఆపరేషన్ సిందూర్.. మన సైనిక, ఆయుధ శక్తి సామర్థ్యాలు, వీర పరాక్రమాలను శత్రుదేశంతో పాటు ప్రపంచానికి తెలిసేలా చేసింది. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సైబర్ డిఫెన్స్, వార్‌ఫేర్ సిస్టమ్స్‌కు అనుసంధానం చేయడంతో ఊహించని అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయ్. లేజర్, మైక్రోవేవ్, పార్టికల్స్ లాంటి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ ఆర్మీ శక్తిని సుసంపన్నం చేస్తున్నాయి.
వీటి తయారీలో దేశంలో వందల కొద్దీ ప్రైవేట్ కంపెనీలు, MSMEలు, స్టార్టప్‌లు డిఫెన్స్ సెక్టార్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయ్. సరికొత్త ఆయుధాల ఆవిష్కరణలతో ప్రపంచ వేదికలపై సత్తా చాటుతూ మన దేశ కీర్తిని, ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా నిలుపుతున్నాయ్. దశాబ్ద కాలంలో మన దేశ రక్షణ రంగ ఎగుమతులు 15 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం.
నాణ్యమైన, నమ్మకమైన ఆయుధాల తయారీకోసం మన శాస్త్ర, సాంకేతిక నిపుణులు సాగిస్తున్న మేధోమథన యాగం.. భవిష్యత్ తరాలకు ఎనలేని ఆత్మవిశ్వాసం. దేశ భద్రతకు తిరుగులేని రక్షణ కవచం. ఇది దేశం కోసం.. మన యావత్ భారతావనిని సురక్షితం చేసేందుకు, ప్రపంచం ముందు సగర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు సాగుతున్న మహోన్నతమైన ఆయుధ యజ్ఞం. ఇందులో భాగస్వామ్యంగా నిలిచిన పలు సంస్థలను సమున్నతంగా గౌరవించడమే మా ఈ 10TV Beyond Borders Coffee Table Book మహోన్నత ఉద్దేశం. మేరా భారత్ మహాన్..!
బుక్ ఓపెన్ చేయండి..