MP Raghunandan Rao
10TV Grama Swarajyam : కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమదృష్టితోనే చూస్తుంది. పార్టీలకు అతీతంగా రాష్ట్రాలను అభివృద్ధిపర్చేందుకు కేంద్రం అన్ని విధాల కృషి చేస్తుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. 10టీవీ గ్రామ స్వరాజ్యం.. సర్పంచ్‌ల సమ్మేళనం-2025 కార్యక్రమంలో రఘునందన్ రావు పాల్గొని మాట్లాడారు.
మీ గ్రామంలోని సమస్యల పరిష్కారం కోసం ఓ ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలని రఘునందన్ రావు నూతన సర్పంచ్ లకు సూచించారు. పైసలు లేకుండా ఎలా పనిచేయాలి.. పైసలు ఉండి ఎలా పనిచేయాలి అనే రెండు అంశాలుగా విభజించుకొని ముందుకు సాగాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతీ 5వేల జనాభాకు ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కట్టించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు కేంద్ర ప్రభుత్వమే నేరుగా రూ.20లక్షలు శాంక్షన్ చేసింది. ఇప్పటికే పలు మండలాల్లో మంజూరు అయ్యాయి. కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి. మీ ప్రాంతాల్లో ఐదు వేల జనాభా ఉండి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మంజూరు కాకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని, ఖచ్చితంగా హెల్త్ సెంటర్ పనులు వెంటనే ప్రారంభించటానికి అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నా ఆయనతో మాట్లాడి మీ ప్రాంతానికి ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని రఘునందన్ రావు తెలిపారు.
డిజిటల్ క్లాస్ రూమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద ఎంపిక చేసిన స్కూల్స్‌కు నిధులు విడుదల చేస్తుందని రఘునందన్ రావు చెప్పారు. మీ ప్రాంతాల్లో ఈ పథకం కింద ఎంపికైన స్కూల్స్ ఉంటే.. ఆ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొదటి విడత ఈ ప్రక్రియ పూర్తయితే.. రెండో విడత కింద మళ్లీ పీఎం శ్రీ పథకం కింద స్కూళ్లను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు సుమారు రూ.2కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు సబ్సిడీ ఇస్తుందని, వాటిని సర్పంచ్‌లు సద్వినియోగం చేసుకోవాలని రఘునందన్ రావు సూచించారు.
మీ ఊర్లో పండిన పంటలను స్టోర్ చేసుకోవాలనుకుంటే గ్రామ పంచాయతీ పరిధిలోనే ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ (గోదాం) నిర్మాణానికి రూ.15లక్షలు వస్తాయి. గ్రామ పంచాయతీలో ప్రభుత్వ స్థలం ఉంటే.. సర్పంచ్ తీర్మానంచేసి పంపిస్తే సరిపోతుంది. డిసెంబర్ 31లోగా ఎన్ని దరఖాస్తులు వస్తే అన్ని దరఖాస్తులను పరిష్కరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని రఘునందన్ రావు తెలిపారు.
కొత్తగా ఈవో బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటే పంచాయతీ తీర్మానం చేసి పంపాలని, ఆ బిల్డింగ్ నిర్మాణం కోసం రూ.10లక్షలు కేంద్రం మంజూరు చేస్తుందని రఘునందన్ రావు తెలిపారు. ఈ నిధులన్నీ ఆరేళ్లు.. ఆ తరువాత వచ్చేవి కావు. 30 రోజుల నుంచి ఆరు నెలల్లో వచ్చే డబ్బులు అని రఘునందన్ రావు పేర్కొన్నారు.