10TV Grama Swarajyam: 10టీవీ గ్రామ స్వరాజ్యం.. ‘సర్పంచ్‌ల సమ్మేళనం-2025’ కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ వ్యవస్థ విధానంపై కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న వ్యవస్థలో.. నిధుల కోసం సర్పంచ్ లు చెయ్యి చాచే పరిస్థితి ఉందన్నారు. అటువంటి పరిస్థితి పోవాలని ఆయన ఆకాంక్షించారు.
”అవసరం వచ్చినప్పుడు మీ అధికారాల గురించి, ప్రజల గురించి, నిధుల గురించి అసెంబ్లీలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిధుల విషయానికి వచ్చినప్పుడు.. జనాభా ప్రాతిపదికన కేంద్రం నుంచి నిధులు వచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీల వ్యవస్థ బాధాకరంగా ఉంది. నిధుల కోసం సర్పంచ్ లో చేయి చాచే పరిస్థితి వచ్చింది. అటువంటి విధానం ఉండొద్దు. గ్రామం అని విధాలుగా అభివృద్ధి చెందుతోంది అంటే ఎమ్మెల్యేకు పని ఉండదు, ఎంపీకి పని ఉండదు, ఇంకెవరికీ పని ఉండదు. మొత్తం బాధ్యత అంతా సర్పంచ్ లదే.
పారిశుధ్యం, ప్రజల అవసరాలు అన్నీ.. సర్పంచ్ లకు నిధులు సమకూర్చినప్పుడు ఎమ్మెల్యేలకు, రాష్ట్రానికి ఇబ్బందులు తగ్గుతాయి. ఉభయ సభలలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఈ స్టేజ్ పైనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కూడా ఇక్కడే ఉన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చుకోవడానికి మీరంతా సాయం చేయాలి.
నేను చూసిన పంచాయతీ రాజ్ వ్యవస్థలో అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక సంస్కరణలు జరిగాయి. ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉంటే అప్పుడప్పుడు అనేక సంస్కరణలు వచ్చాయి. జలగం వెంకట్రావు గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గా వచ్చారు. ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఒక కమిటీ వేశారు. ఓంకార్ సీపీఎం పార్టీకి ఒక గొప్ప నాయకుడు. పంచాయతీ రాజ్ వ్యవస్థ సవరణల విషయంలో బాగా మాట్లాడారు. పంచాయతీ రాజ్ వ్యవస్థకు, సర్పంచ్ లకు చాలా గౌరవం ఉంది. గ్రామ పంచాయతీని సచివాలయంగా చెప్పుకుంటాం మనం. అంతేకాదు లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ కూడా కొంత ఉద్యమం చేశారు. గ్రామ పంచాయతీలకు స్వతంత్ర ప్రతిపత్తితో పాటు నిధులు కూడా ఉండాలని పోరాడారు.
సర్పంచ్ లకు కూడా ప్రోటోకాల్ ఉంది. మీకు అధికారాలు బాగా ఉన్నాయి. నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలి అనేదానికి కూడా మీకు అంత స్వతంత్రం ఉంది. కానీ, ఆ నిధులు సమకూర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు అనేకమైన ఆటంకాలు కలుగుతున్నాయి. మరీ ప్రత్యేకంగా నా అభిప్రాయంలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రామ పంచాయతీల విషయంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వాల దయపైనే గ్రామ పంచాయతీలు పని చేశాయి. గ్రామ పంచాయతీలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరిగితే మీకు వచ్చే నిధులు కూడా రాష్ట్ర ఖజనాకు పోయాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా రాష్ట్ర ఖజానాకు పోయాయి. వ్యవస్థను కొంత ఇబ్బంది పెట్టడం వల్ల గ్రామాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమే” అని కోదండరెడ్డి అన్నారు.