Ankathi Raju
10TV Beyond Borders: “బియాండ్ బోర్డర్స్ సెక్యూరింగ్ ది వరల్డ్” కార్యక్రమాన్ని నిర్వహించిన 10TVని హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్) డైరెక్టర్ అంకత్తి రాజు ప్రశంసించారు.
“బియాండ్ బోర్డర్స్ సెక్యూరింగ్ ది వరల్డ్” కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ, అవార్డుల ప్రదానోత్సవంలో అంకత్తి రాజు గౌరవ అతిథిగా పాల్గొని మాట్లాడారు.
“10టీవీ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రక్షణ రంగంలో మన దేశం ప్రారంభ దశ నుంచి మహాశక్తిగా ఎదిగింది. నేడు ఇండియా రక్షణ పరిశోధనలో మాత్రమే కాదు, రక్షణ సాంకేతికత, తయారీ రంగ అభివృద్ధిలో కూడా శక్తిమంతంగా ఉంది.
ఇటీవలి కాలంలో మన అవసరాలకే పరిమితం కాకుండా రక్షణ వ్యవస్థల ఎగుమతులు కూడా ప్రారంభించాం. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్, పినాకా రాకెట్, ఆధునిక టోడ్ ఆర్టిలరీ వంటి తదితర అనేక వ్యవస్థలు ఇప్పుడు ఎగుమతులు అవుతున్నాయి.
ప్రైవేట్ పరిశ్రమలు, రక్షణ ఉత్పత్తి సంస్థలు ఈ ప్రయత్నంలో చురుకుగా భాగస్వాములు అవుతున్నాయి. రక్షణ ఎగుమతుల శాతం 40 దాటింది. ఇండియా స్నేహపూర్వక దేశాలకు రక్షణ వ్యవస్థలు ఎగుమతి చేయడం గర్వకారణం.
ఇది దేశానికి గొప్ప విజయమే అయినా ఇక్కడితో ఆగే ఉద్దేశం లేదు. ప్రపంచ అవసరాల కోసం కూడా వ్యవస్థల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాం. మన వ్యవస్థల నాణ్యత గణనీయంగా మెరుగైంది, విశ్వసనీయత లోటు తగ్గింది, కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఇప్పుడు సాధ్యమైంది. సాంకేతిక పురోగతి, పరిశ్రమ భాగస్వాముల సామర్థ్యం వల్ల కఠిన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అత్యుత్తమ స్థాయిలో వ్యవస్థలు తయారవుతున్నాయి.
ఈ పురోగతి మాకు గర్వకారణం. మెరుగైన నాణ్యతా ప్రమాణాలతో దేశ రక్షణ సాంకేతికాల అభివృద్ధికి మన ప్రతిభను వినియోగిస్తున్నాం. రాబోయే కాలంలో ఇండియా అవసరాలకే కాదు ప్రపంచ అవసరాలకూ వ్యవస్థల తయారీ జరగనుంది. 10టీవీ తీసుకున్న ఈ చొరవ బాగుంది. ఇక్కడ ఉన్న రక్షణ ఉత్పత్తి సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు, రక్షణ పరిశ్రమలతో కలిసి జాతీయ అవసరాలు, గ్లోబల్ అవసరాలు రెండింటికీ సిస్టమ్స్ నిర్మించేందుకు కట్టుబడి ఉన్నాం.
అన్ని పరిశ్రమల భాగస్వాములు నాణ్యతపై, సమయపాలనపై దృష్టి పెట్టాలని కోరుతున్నాను. దేశ అవసరాలు, ప్రపంచ అవసరాలు రెండింటికీ సిస్టమ్స్ తయారు చేయాలి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో అందరి చూపూ మనపై ఉంది. శక్తిమంతమైన సామర్థ్యవంతమైన దేశంగా ఎదగాలి.
సాంకేతికతను అందిపుచ్చుకోవడమే కాదు.. ఇందులో లీడర్‌గా మారాలి. ఆ దిశగా మన ప్రయాణం సాగుతోంది. దేశాన్ని మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దేందుకు మనమంతా కలిసి పనిచేయాలి. హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు ఈ ఆశయానికి బాగా సహకరిస్తాయని నేను నమ్ముతున్నాను. ఈ దేశాన్ని ప్రగతిశీల దేశంగా, మరింత గొప్ప దేశంగా మార్చేందుకు కలిసి పనిచేద్దాం” అని అన్నారు.