Site icon 10TV Telugu

10TV Edu Visionary 2025: వీటన్నింటికీ 10టీవీ కాఫీ టేబుల్ బుక్ సమాధానం చెబుతుంది: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

10TV Edu Visionary 2025

10TV Edu Visionary 2025

10TV Edu Visionary 2025: 10టీవీ నిర్వహించిన 10tv Edu Visionary 2025 ఈవెంట్‌లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడారు. “నిన్న పేపర్‌లో చదివిన మూడు అంశాలను మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను.

మొదటిది కూకట్ పల్లిలో ఒక 10 ఏళ్ల అమ్మాయిని ఒక 14 ఏళ్ల విద్యార్థి అతి దారుణంగా చంపేశాడు. ఇది నేను చదివిన మొదటి వార్త. రెండవది భూపాలపల్లిలో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఒక టీచర్ మంచి నీళ్ళలో పెస్టిసైడ్ కలిపాడు.

ఇది నేను చదివిన రెండవ సంఘటన. మూడవ ఘటన ఐఐటీ కరగపూర్‌లో ప్రొఫెసర్ అరుణ్ చక్రవర్తి అనే వ్యక్తికి ప్రొఫెసర్ ఆఫ్ స్టూడెంట్ వెల్ బీయింగ్ అని నియమించారు. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఐఐటీలో ఒక ప్రొఫెసర్ ని స్టూడెంట్ వెల్ బీయింగ్ గా అపాయింట్ చేయడం.

సైకియాట్రిక్ కౌన్సిలింగ్ కు వచ్చే విద్యార్థుల సంఖ్య సంవత్సరాల సంవత్సరాలు పెరిగిపోతున్నాయి. ఎటువైపు వెళ్తున్నాం? ఏ విధంగా సమాజం ముందుకు వెళ్తుంది? విద్యా వ్యవస్థ ఎలా ఉంది? వీటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది.

మొదట ఐఐటీ, ఐఐటీ అంటున్న పిల్లలు మరి ఫైనల్ గా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి కౌన్సెలింగ్ ఎందుకు తీసుకుంటున్నారు? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? అన్నది మనం ఆలోచించాల్సిన అంశం. 10వ తరగతిలో చదువుతున్న పిల్లవాడు ఇంకొక అమ్మాయిని ఎందుకు ఇంత కర్కశంగా చంపేస్తున్నాడు అన్నది మనం ఆలోచించాల్సిన విషయం.

పిల్లల భవిష్యత్తు కోరాల్సిన ఒక టీచర్ ఆ పిల్లలకు ఏదైనా జరుగుతుందని ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కూడా ఆ పిల్లలు తాగే నీళ్లలో పెస్టిసైడ్ కలిపే స్థాయికి ఒక మాస్టర్ ఎందుకు వెళ్లిపోతున్నాడు అన్నది మనం ఆలోచించాల్సిన అంశం.

విద్యార్థుల ముందున్న ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే నేను ఎక్కడ చదవాలి? ఏం చదవాలి? దీని 10టీవీ ఈ కాఫీ టేబుల్ బుక్ అన్నది సమాధానం చెబుతుంది. ఈ కాఫీ టేబుల్ బుక్ లో అనేక విద్యా సంస్థల గురించి రాశారు. ఆ సంస్థలు ఇంతవరకు ఏం చేశాయి? విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నాయి? వంటివి ఉన్నాయి.

Exit mobile version