బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా తుపాను’ అత్యంత వేగంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. తీరం దాటేందుకు సిద్ధమవుతున్న ఈ పెను తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఈరోజు నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రేపు (మంగళవారం) ఉదయానికి మరింత తీవ్రమై, అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనుంది.
తుఫాను తీరం దాటిన తర్వాత నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ సూచనలను పాటించాలని విజ్ఞప్తి.
తుఫాను నేపథ్యంలో ఈరోజు ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి. రేపు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.