హైదరాబాద్ లోని కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో కేవలం రూ.50 కే 15 రకాల ఆరోగ్య పరీక్షలు చేసుకొనే అవకాశం కల్పించారు.
హైదరాబాద్ కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన హెల్త్ కియోస్క్‌లు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. కేవలం రూ.50 రూాపాయలకే..15 రకాల ఆరోగ్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలోని ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉంచారు.
బీపీ, షుగర్, బరువు, బోన్‌మారో, శరీరంలో కొలెస్ట్రాల్, ప్రొటీన్ స్థాయి తదితర 15 రకాల పరీక్షలపైన అవగాహన లభిస్తుంది. ముఖ్యంగా వేల కొద్దీ కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు.. నిద్రలేమి, అలసట ఇతర సమస్యలతో బాధపడేవారు ప్రయాణ సమయంలో తమ ఆరోగ్యస్థితిని తెలుసుకునేందుకు ఈ కియోస్క్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని రైల్వేశాఖ ప్రకటించింది.
ప్రతి రోజు సికింద్రాబాద్ నుంచి లక్షా 95 వేల మంది, కాచిగూడ నుంచి లక్ష మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వందల్లో ఖర్చయ్యే వైద్య పరీక్షలను కేవలం రూ.50లకే అందజేస్తుండటంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాసింజర్స్ నుంచి మంచి స్పందన కూడా వస్తుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి వివరించారు. ఇది ప్రయాణికులకు తమ ఆరోగ్యంపై ఒక ప్రాథమిక అవగాహనను కల్పిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రైల్వేస్టేషన్లలో హెల్త్ కియోస్కోలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారాయన.