sudden weight gain and loss : అకస్మాత్తుగా బరువు పెరగటం, తగ్గటం గమనిస్తున్నారా! ఎందుకిలా జరుగుతుందంటే?

బరువు విషయంలో హెచ్చు, తగ్గులకు ఆస్కారం కల్పించకుండా ఉండాలంటే భోజనాల మధ్య ఎక్కువ సమయం లేకుండా చూసుకోవాలి. అధికమొతాదులో తినకుండా కొద్దికొద్ది మొత్తాల్లో ఎక్కువసార్లు తీసుకోవాలి. దీని వల్ల కొవ్వు నిల్వలు పెరగకుండా చూసుకోవచ్చు.

sudden weight gain and loss

sudden weight gain and loss : శరీర బరువులో హెచ్చుతగ్గులు అనేవి సర్వసాధారణం. తక్కువ వ్యాయామం చేసి, ఎక్కువ తింటూ ఉంటే బరువు పెరగవచ్చు. అలాగే తక్కువ తిని ఎక్కవ వ్యాయామం చేస్తే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ రకమైన హెచ్చు తగ్గులు సాధారణంగా రోజు వారిగా చూస్తుంటాం. బరువు తగ్గడం లేదా పెరగడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఎప్పుడొస్తుందంటే అకస్మాత్తుగా బరువు తగ్గటం, బరువు పెరగటాన్ని గుర్తించినప్పుడు మాత్రమే. అలాంటి సందర్భంలో వైద్యుడిని కలసి సూచనలు సలహాలు తీసుకోవాలి.

వయస్సు పెరుగుతున్న కొద్దీ బరువు పెరగటం అన్నది శారీరక శ్రమ తగ్గడంతో పాటు మెటబాలిజం మందగించడం వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ఉన్నట్లుండి బరువు పెరిగిపోతుంటారు. ఈవిధంగా ఎందుకు జరుగుతోందా అని ఆందోళన పడుతూ, బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, బరువు పెరగడమే కాదు.. ఉన్నట్లుండి బరువు తగ్గినా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్నట్లుండి బరువు పెరగటానికి, తగ్గటానికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

అకస్మాత్తుగా బరువు పెరగటానికి ; శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో మార్పుల కారణంగా జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది. ఇది ఒక్కసారిగా బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ, నిద్రలేమి వంటి మానసిక సమస్యల బారిన పడినప్పుడు శరీరంలో కార్టిసాల్‌ అనే ఒత్తిడి హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తవుతుంది. దీని వల్ల బరువు పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తినప్పుడు అలసట ఆవహిస్తుంది.. దాన్ని గ్రహించలేక మన శరీరం ఆకలి అనుకొని ఏది పడితే అది తినడం వల్ల బరువు పెరిగిపోతారు. ఇలాంటి పరిస్ధితిని నివారించాలంటే శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా జాగ్రత్తపడడం మంచిది.

వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడినప్పుడు తొలి దశలో బరువు తగ్గుతారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పొట్టలో ద్రవాల స్థాయులు పెరుగుతాయి. ఇది కూడా కొన్ని సందర్భాలలో బరువు పెరగడానికి కారణమౌతుంది. ఒత్తిడి తగ్గించే మందులు, గర్భ నిరోధక మాత్రలు వంటి మందులు కూడా శరీర బరువు పెరగడానికి దోహదమౌతాయి. నెలసరి వల్ల కూడా కొంతమంది బరువు పెరుగుతారు. రుతుక్రమం సమయంలో శరీరం నీరు నిలుపుకోవడం ఓ కారణమైతే, ఈస్ట్రోజెన్‌-ప్రొజెస్టిరాన్‌.. వంటి హార్మోన్ల స్థాయుల్లో మార్పులు మరో కారణమని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గటానికి కారణాలివే ; థైరాయిడ్‌ గ్రంథి చురుగ్గా ఉండి ఎక్కువ మొత్తంలో థైరాయిడ్‌ హార్మోన్లను విడుదల చేసే దశను హైపర్‌ థైరాయిడిజంగా పేర్కొంటారు. ఈ క్రమంలో శరీరంలోని క్యాలరీలు ఎక్కువగా కరిగిపోయి బరువు కూడా అధికంగా కోల్పోతారు. డిప్రెషన్‌ మెదడులోని కొన్ని భాగాలపై ప్రతికూల ప్రభావం చూపి ఆకలిని తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు. అయితే ఈ సమస్య అందరిలో ఒకేలా ప్రభావం ఉండదు. రుమటాయిడ్‌ ఆర్థ్రైటిస్‌ వంటి ఆటో ఇమ్యూన్‌ సమస్య రోగనిరోధక వ్యవస్థ అనుకోకుండా మన శరీర అవయవాల పైనే దాడి చేసి ఆకలి మందగించడం, పొట్టలో వాపు వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. దీని వల్ల శరీరానికి తగిన పోషకాలు అందవు. ఇది బరువు తగ్గేందుకు దారి తీస్తుంది. మధుమేహం ఉన్న వారిలో తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి కాక శరీరం శక్తి కోసం కొవ్వులు, కండరాల మీద ఆధారపడుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న వారు అధిక చక్కెర స్థాయుల కారణంగా పదే పదే మూత్రవిసర్జనకు వెళ్లడం వల్ల డీహైడ్రేషన్‌కి గురవుతారు. ఈ రెండు కారణాల వల్ల మధుమేహులు బరువు కోల్పోవాల్సి వస్తుంది.

బరువు విషయంలో హెచ్చు, తగ్గులకు ఆస్కారం కల్పించకుండా ఉండాలంటే భోజనాల మధ్య ఎక్కువ సమయం లేకుండా చూసుకోవాలి. అధికమొతాదులో తినకుండా కొద్దికొద్ది మొత్తాల్లో ఎక్కువసార్లు తీసుకోవాలి. దీని వల్ల కొవ్వు నిల్వలు పెరగకుండా చూసుకోవచ్చు. తాజా పండ్లు మరియు కూరగాయలు తినడం వంటి మరింత ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవాలి. శారీరక శ్రమను పెంచుకోవాలి. రోజువారీ వ్యాయామం కేలరీలను బర్న్ చేయడమే కాదు, కండర ద్రవ్యరాశి అభివృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది

వివిధ రకాల అనారోగ్య సమస్యలతో పాటు హార్మోన్లలో, మన జీవనశైలిలో మార్పుల కారణంగా శరీర బరువులో హెచ్చుతగ్గులనేవి సహజం అంటున్నారు నిపుణులు. అయితే మీ అలవాట్లలో మార్పులు లేకపోయినా, ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ అనుసరిస్తోన్నా, వెంటవెంటనే బరువులో హెచ్చుతగ్గులు గమనిస్తే మాత్రం ఓసారి డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స, సలహాలు తీసుకోవడం మంచిది.