తిరుపతి లడ్డూ సరే.. కల్తీ నెయ్యిని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా గుర్తించాలి?

ఏ ల్యాబ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, పరికరాలు ఉపయోగించాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన ఇంట్లోనే ఉండి.. కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా నెయ్యి స్వచ్చతను ఇట్టే తెలుసుకోవచ్చు..

Ghee Purity Check : ఆహార కల్తీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ మధ్య కాలంలో చాలావరకు ఆహార పదార్ధాలను కల్తీ చేస్తున్నారు. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నెయ్యి. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వాడే నెయ్యిని కల్తీ చేశారనే వార్త సంచలనంగా మారింది. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు కలిసి ఉన్నాయనే నివేదిక దుమారం రేపుతోంది. ఈ పరిస్థితుల్లో నెయ్యి కల్తీ అయ్యిందా? లేదా? అనే అనుమానం అందరినీ వేధిస్తోంది.

తిరుపతి లడ్డూ సరే.. రోజూ మనం అన్నంలో కలుపుకునే నెయ్యి అసలైందేనా? ఏది అసలు నెయ్యి..? ఏది కల్తీ నెయ్యి..? కల్తీ నెయ్యిని మనం ఇంట్లోనే సింపుల్‌గా ఎలా గుర్తించాలి? బ్రాండెడ్‌ నెయ్యి కల్తీ అని తేలితే ఎవరికి ఫిర్యాదు చేయాలి? అసలు నెయ్యి నాణ్యతను తెలుసుకోడం ఎలా.. నెయ్యి స్వచ్చమైనదా? కాదా? అని గుర్తించడం ఎలా అనే ప్రశ్న తలెత్తింది. అయితే, ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదంటున్నారు నిపుణులు. ఏ ల్యాబ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, పరికరాలు ఉపయోగించాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన ఇంట్లోనే ఉండి.. కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా నెయ్యి స్వచ్చతను ఇట్టే తెలుసుకోవచ్చు అని చెబుతున్నారు. మరి ఆ పద్ధతులు ఏంటి? నెయ్యి స్వచ్చతను తెలుసుకోవడం ఎలాగంటే..

మీ నెయ్యి స్వచ్ఛంగా ఉందో లేదో ఇలా చెక్ చేయండి…

1. గడ్డకట్టే పరీక్ష

ఒక గాజు పాత్రలో కొద్ది మొత్తంలో నెయ్యి వేసి కొన్ని గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచండి. స్వచ్ఛమైన నెయ్యి అయితే ఒక్కటిగా గడ్డ కడుతుంది. అలా జరగలేదంటే అది కల్తీ అయినట్లే. సోయాబీన్, కొబ్బరి లేదా పొద్దుతిరుగుడు నూనెలతో ఆ నెయ్యి కల్తీ కావచ్చు.

2. హీటింగ్ టెస్ట్

వేడి చేయడం.. ఇది మరొక అద్భుతమైన నెయ్యి పరీక్ష. పాన్‌లో ఒక టేబుల్‌ స్పూన్ నెయ్యి వేసి తక్కువ వేడి మీద వేడి చేయండి. “స్వచ్ఛమైన నెయ్యి  త్వరగా కరిగి, స్పష్టమైన ద్రవంగా మారుతుంది. పొగ, కాలిన వాసన ఎక్కువగా రాదు. కరగడానికి ఎక్కువ సమయం పట్టినా, లేదా అవశేషాలు మిగిలిపోయినా, నెయ్యి కల్తీ కావచ్చు.

3. అయోడిన్ టెస్ట్

కొద్ది మొత్తంలో నెయ్యిలో కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. నెయ్యి నీలం రంగులోకి మారితే, అది స్టార్చ్ ఉనికిని సూచిస్తుంది. అంటే అది కల్తీ అని అర్థం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తినకూడదు.

4. పామ్ టెస్ట్ (అరచేతి పరీక్ష)

మీ అరచేతిపై కొద్ది మొత్తంలో నెయ్యి ఉంచండి. అది మీ శరీర వేడికి ఎలా స్పందిస్తుందో చూడండి. స్వచ్ఛమైన నెయ్యి కొన్ని సెకన్లలో కరిగిపోతుంది. ఇది గట్టిగా ఉంటే లేదా కరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటే, ఆ నెయ్యిని కూరగాయల నూనెలు లేదా కొవ్వులతో కలపి ఉండొచ్చు.

5. వాటర్ టెస్ట్

నెయ్యి స్వచ్ఛతను నీటితో తనిఖీ చేయొచ్చు. ఒక టీస్పూన్ నెయ్యిని ఒక గ్లాసు నీటిలో కరిగించండి. స్వచ్ఛమైన నెయ్యి ఉపరితలంపై తేలుతుంది. కానీ అది నీటిలో కలిసినా లేదా దిగువకు మునిగినా, అది నూనెలతో కల్తీ కావచ్చని అర్థం.

6. స్పూన్ టెస్ట్

ఒక చిన్న చెంచాపై నెయ్యి తీసుకుని మంట మీద వేడి చేయాలి. స్వచ్ఛమైన నెయ్యి పూర్తిగా కరిగిపోతుంది. అవశేషాలు లేకుండా స్పష్టమైన ద్రవంగా మారుతుంది. అలా కాకుండా అంటుకునే అవశేషాలు ఉన్నా.. లేదా వాసన లేకపోయినా.. ఆ నెయ్యి అపరిశుభ్రమైనదిగా చెప్పొచ్చు.

7. టేస్ట్ టెస్ట్

కొద్దిగా నెయ్యి తీసుకుని రుచి చూడండి. స్వచ్ఛమైన నెయ్యి రుచికరంగా, వగరుగా ఉంటుంది. నూనె లేదా జిడ్డుగల రుచి అనిపిస్తే.. ఆ నెయ్యి కల్తీని సూచిస్తుంది.

8. పేపర్ టెస్ట్

ఒక తెల్ల కాగితం లేదా వస్త్రంపై నెయ్యి చుక్క వేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి. స్వచ్ఛమైన నెయ్యి క్రమంగా మాయమయ్యే జిడ్డు మరకను కలిగి ఉంటుంది. మరక అలాగే ఉన్నా లేదా జిడ్డుగా ఉన్నా.. అది ప్యూర్ నెయ్యి కాదని.. అందులో కూరగాయల నూనె కలిసిందని సూచిస్తుంది.