ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తిస్తోంది ఈ మహమ్మారి. వందలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. వేలాది మంది వైరస్ బారిన పడ్డారు. గాలిద్వారా వ్యాపించే ఈ వైరస్.. చాప కింద నీరులా రోజురోజుకీ ప్రపంచాన్ని చుట్టేస్తోంది.
వైరస్ ప్రభావంతో ఇప్పటివకరూ 361 మందికి పైగా మృతిచెందారు. మరో 17వేల మందికి పైగా వైరస్ సోకి ప్రాణాలు నిలుపుకు నేందుకు పోరాడుతున్నారు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న వైరస్ దెబ్బకు చైనా ఆర్థికంగానూ నష్టపోయింది. కరోనా ప్రబలడంతో అక్కడివారంతా రోజులు లెక్కెట్టుకుంటున్నారు.వైరస్ బాధితుల కోసం చైనా వైద్యసదుపాయాలను అందించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.
మందులేని ఈ వైరస్ సోకిన బాధితులకు వైద్య సాయం అందించేందుకు 1000 పడకల ఆస్పత్రిని నిర్మించింది. కేవలం 10 రోజుల్లో వెయ్యికు పైగా పడకల ఆస్పత్రిని నిర్మించి చైనా రికార్డు సృష్టించింది. కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వైద్యపరంగా సౌకర్యాలు లేకపోవడంతో యుద్ధ ప్రాతిపాదికన చైనా అత్యంత తక్కువ సమయంలోనే వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించిన దేశంగా చైనా అవతరించింది.
1.1 కోట్లు జనాభా ఎక్కువగా ఉన్న వుహాన్ నగరం చైనాకు గుండెకాయలాంటిది. ఇక్కడే నుంచి ఇతర దేశాలకు పెద్ద ఎత్తునా వాణిజ్య కార్యకలాపాలు జరుగుతుంటాయి. మహమ్మారి కరోనా వైరస్ కూడా పుట్టింది ఇక్కడే. వైరస్ సోకి మరణించినవారి సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువ. వుహాన్ నగర శివారులో హువశెన్షన్ ఆస్పత్రి పేరుతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ ఆస్పత్రి నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. సాధారణంగా ఒక ఆస్పత్రి నిర్మించాలంటే రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది.
కానీ, చైనా 1000 పడకల ఆస్పత్రిని కేవలం తొమ్మిది రోజుల్లే నిర్మించి రికార్డు సృష్టించింది. తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రీ ప్రాబ్రికేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ ని సిద్ధంగా ఉంచింది. వీటిన్నింటిని ఒకేచోటకీ చేర్చి నిర్మాణం పూర్తి చేసింది. మొత్తం 419 వార్డులను ఏర్పాటు చేసింది. 7000 మంది కార్మికులు 24×7 గంటలపు నిర్మాణంలో పాల్గొన్నారు. 1000కి పైగా భారీ మిషన్లు నిర్మాణ పనుల్లో పాల్గొన్నాయి.
26,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్పత్రిని సిద్ధం చేశారు. ఇందులో మొత్తం 30 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ISU) సహా 419 వార్డులు ఉన్నాయి. ఇంకా 1400 మంది వైద్యులు అందుబాటులో ఉండనున్నారు. మరో 1600 పడకల ఆస్పత్రి కూడా సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 5వ తేదీలోగా ఈ ఆస్పత్రి నిర్మాణం పూర్తి కానున్నట్టు అంచనా వేస్తున్నారు. ఆ రోజు నుంచే వైరస్ బాధితులను ఆస్పత్రిలోకి అనుమతించనున్నట్టు తెలిపారు.