చైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారా? ఫ్లయిట్ కూడా బుకింగ్ చేసుకున్నారా? వెంటనే రద్దు చేసుకోండి. లేదంటే డేంజరస్ కరోనా వైరస్ కాటేస్తుంది జాగ్రత్త.. పాముల నుంచి మనుషులకు సంక్రమించిన ఈ ప్రాణాంతక వైరస్.. గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ వందలాది మందికి సోకింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్.. ప్రపంచ దేశాలను ఆందోనకు గురిచేస్తోంది. చైనాకు వెళ్లి వచ్చిన చాలామందిలో ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. చైనా పర్యటనకు వెళ్లేవారంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వైరస్ ప్రబలిన నగరమైన వుహాన్ సిటీని ఇప్పటికే మూసివేశారు. వుహాన్ సిటీకి రాకపోకలను కూడా చైనా బంద్ చేసింది.
విమాన సర్వీసులన్నీ రద్దు :
అంతేకాదు.. వుహాన్ నుంచి వేరే సిటీలు, విదేశాలకు వెళ్లే విమానాలు, విదేశాల నుంచి వుహాన్ ఎయిర్ పోర్టులకు వచ్చే విమాన సర్వీసులన్నింటిని రద్దు చేశారు. రైళ్లు, బస్సులనూ ఆపేశారు. ఒక్కసారి ఈ వైరస్ మనిషికి సోకితే.. ప్రారంభంలో ఫ్లూ లక్షణాలతో మొదలై నెమ్మదిగా తీవ్రంగా మారుతుంది. తద్వారా మరణానికి దారి తీస్తుందని అంటున్నారు. వుహాన్ సిటీకి వచ్చిన చాలామంది విదేశీయులను ఇక్కడి మార్కెట్లలో జంతువుల మాంసం ప్రధానంగా ఆకర్షిస్తోంది. అక్కడి ఫుడ్ రెస్టారెంట్లలో జంతువుల మాంసంతో పాటు పాముల మాంసాన్ని కూడా అమ్ముతుంటారు.
పాముల మాంసానికి ఫుల్ గిరాకీ :
పాముల మాంసానికి వుహాన్ సిటీలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చినవారంతా తప్పకుండా ఈ వంటకాలను రుచి చూసి వెళ్తుంటారు. పాముల్లోని ఈ ప్రాణాంతక వైరస్ మనుషులు వాటిని తినడం ద్వారా సంక్రమిస్తోందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఈ వైరస్ ఎలా పుట్టింది అనడానికి కచ్చితమైన ఆధారాలు లేనప్పిటికీ… గబ్బిలాల నుంచి పాములకు.. పాముల నుంచి మనుషులకు సంక్రమించినట్టు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. చైనాకు వెళ్లి తిరిగి వచ్చే విమాన ప్రయాణికులను ప్రత్యేకించి స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వారిలో ఈ కరోనా వైరస్ కారక లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అని పరీక్షిస్తున్నారు. అనుమానం వస్తే.. వెంటనే వారికి నివారణ చర్యలు చేపడుతున్నారు.
నో వ్యాక్సీన్.. యాంటీ ట్రీట్ మెంట్ :
వాస్తవానికి ఈ కొత్త కరోనా వైరస్ కు ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సీన్ గానీ, యాంటి ట్రీట్ మెంట్ అనేది ఏది అందుబాటులో లేదు. నివారణ ఒక్కటే మార్గం.. ఈ వైరస్ బారిన పడివారు ఎంతకాలం జీవిస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. వ్యాక్సీన్ కనిపెట్టేంత వరకు ప్రాణాలు నిలబడవు కదా? అందుకే ముందు జాగ్రత్త చర్యగా ప్రీకాషన్స్ తీసుకోవాలని అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా సహా థాయిలాండ్, దక్షిణ కొరియా, తైవాన్, మాకౌ, హాంగ్ కాంగ్, సింగపూర్, వియత్నాం, ఫ్రాన్స్, అమెరికా, సౌదీ దేశాలకు పర్యాటనకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు.
అయ్యో.. ముందే ప్లాన్ చేసుకున్నాం కదా.. ఎలా.. తప్పనిసరిగా వెళ్లాలనుకుంటే చేసేది ఏమిలేదు.. కానీ, సరద కోసం వెళ్లాలనుకుంటే మాత్రం ఈ వైరస్ తీవ్రత తగ్గింత వరకు వేచి ఉండటమే ఉత్తమమని ప్రజా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వుహాన్ లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉందని, ఇప్పటివరకూ చైనా సహా ఇతర దేశాల్లో 1000 వరకు కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, అందులో 41 మంది వైరస్ ప్రభావంతో మృతిచెందినట్టు నివేదికలు చెబుతున్నాయి.
Read Also : కరోనా వైరస్ ఎలా పుట్టింది? పాముల నుంచి మనుషుల్లోకి ఎలా?